సూర్యుడు ఈ విధంగా ప్రసన్నుడవుతాడట !

సూర్యుడి రాకతోనే లోకంలోని చీకట్లు తొలగిపోతాయి ... ఆయన పడమర దిశగా వాలిపోవడంతోనే తిరిగి లోకాన్ని చీకట్లు ఆవరిస్తాయి. జీవరాసులు సూర్యోదయంతో చైతన్యం తెచ్చుకుని తమకి కావలిసిన ఆహారాన్ని సంపాదించుకుంటాయి. ఆయన వెళ్లిపోగానే చైతన్యాన్ని కోల్పోయి విశ్రాంతి తీసుకుంటూ వుంటాయి.

అందుకే తమకి చైతన్యాన్ని ప్రసాదించి తమ జీవనానికి ఆధారమైన సూర్యుడిని ప్రాచీనకాలం నుంచి ప్రత్యక్ష నారాయణుడుగా భావించి ఆరాధించడం జరుగుతోంది. రవిగ్రహం ఇంతటి విశిష్టతను సంతరించుకుని కనిపిస్తున్నా, జాతకంలో రవి స్థితి సరిగ్గా లేనివాళ్లు కొన్నిరకాల సమస్యలను ఎదుర్కుంటూ వుంటారు.

రవిగ్రహ సంబంధమైన దోషం కారణంగా బంధుమిత్రులతోను ... పైఅధికారులతోను మనస్పర్థలు తలెత్తడం ... శతృత్వం పెరగడం జరుగుతుంటుంది. అపజయాలు ... అవమానాలు ఎదురవుతూ వుంటాయి. అందువలన రవిని ప్రసన్నం చేసుకోవడానికి ఎవరికి తెలిసిన మార్గాన్ని వాళ్లు అనుసరిస్తూ వుంటారు.

రవి అనుగ్రహాన్ని పొందాలనుకునేవాళ్లు ప్రతినిత్యం సూర్యుడికి 'అర్ఘ్యం' సమర్పించడమే కాకుండా, 'మాణిక్యం' ధరించాలని శాస్త్రం చెబుతోంది. బంగారం ... బెల్లం ... ఎర్రని వస్త్రం ... గోధుమలు ... ఆవుదూడలను ఆదివారం రోజున బ్రాహ్మణుడికి దానం చేయాలని అంటోంది. ఈ నియమాలను పాటిస్తూ సూర్యుడిని ఆరాధించినట్టయితే, ఆయన అనుగ్రహం లభిస్తుందనీ .. ఫలితంగా దోషప్రభావం తొలగిపోతుందని స్పష్టం చేయబడుతోంది.


More Bhakti News