కార్యసిద్ధిని కలిగించే క్షేత్రం
ప్రతి ఒక్కరూ తమ కుటుంబ శ్రేయస్సుకు సంబంధించిన ఏదో ఒక పనిని ఆరంభిస్తూ ఉంటారు. అవి వ్యాపార వ్యవహారాలకి సంబంధించినవి కావొచ్చు ... వివాహ వేడుకలకి సంబంధించినవి కావొచ్చు. ఆ పనులను ఆరంభించిన తరువాత అవి ఎంతవరకూ సఫలీకృతమవుతాయో తెలియక మానసిక వత్తిడికి గురవుతుంటారు.
తాము తలపెట్టిన కార్యాలకి ఎలాంటి ఆటంకాలు కలగకుండా విజయవంతమయ్యేలా చూడమని అందరూ భగవంతుడిని వేడుకుంటూ వుంటారు. ఈ నేపథ్యంలో కార్యసిద్ధిని కలిగించేవిగా కొన్ని క్షేత్రాలు చెప్పబడుతున్నాయి. అలాంటి క్షేత్రాల జాబితాలో మెదక్ జిల్లాకి చెందిన 'పొట్టిపల్లి' ఒకటిగా కనిపిస్తూ వుంటుంది. ప్రాచీనమైనదిగా చెప్పబడుతోన్న ఈ క్షేత్రంలో 'సిద్ధేశ్వరుడు' దర్శనమిస్తూ ఉంటాడు.
పూర్వం ఎంతోమంది సిద్ధపురుషులు ఇక్కడి స్వామివారిని పూజించినట్టు స్థలపురాణం చెబుతోంది. వాళ్లంతా పరమశివుడిని అనునిత్యం సేవిస్తూ అనేక సిద్ధులు పొందినట్టు చెబుతుంటారు. సిద్ధులు పూజించిన కారణంగా ... సిద్ధులు పొందిన కారణంగా ఇక్కడి స్వామిని 'సిద్ధేశ్వరుడు' అని పిలుస్తుంటారు. ఇక్కడి స్థలమహాత్మ్యం గురించి ఎన్నో ఆసక్తికరమైన కథనాలు వినిపిస్తూ వుంటాయి.
ఈ స్వామివారిని దర్శించి ... అర్చించి ఆరంభించిన పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయని చెబుతుంటారు. ఈ కారణంగానే ఆయా కార్యాలను తలపెట్టిన భక్తులు స్వామివారి అనుమతి తీసుకుని, మనసులోనే ఆయనకి ఆహ్వానం చెప్పుకుని ఆరంభిస్తూ వుంటారు. సిద్ధేశ్వరుడి కరుణాకటాక్ష వీక్షణాల వలన కార్యసిద్ధిని పొందినవాళ్లు, అనుకున్న సమయానికి మళ్లీ వచ్చి మొక్కుబడులు చెల్లించుకుంటూ వుంటారు.