అగస్త్యేశ్వరలింగం అలా వెలుగుచూసింది !

ఆదిదేవుడు కొలువై పూజాభిషేకాలు అందుకుంటోన్న అత్యంత ప్రాచీనమైన క్షేత్రాల్లో 'నందివెలుగు' ఒకటిగా కనిపిస్తూ వుంటుంది. ఈ క్షేత్రంలో శివలింగాన్ని అగస్త్యమహర్షి ప్రతిష్ఠించినట్టుగా స్థలపురాణం చెబుతోంది. ఈ కారణంగానే ఇక్కడి స్వామిని 'అగస్త్యేశ్వరుడు' గా పిలుస్తూ ... కొలుస్తూ వుంటారు.

అలా ఎప్పుడో అగస్త్యేశ్వరుడి చేతుల మీదుగా ప్రతిష్ఠించబడిన ఈ శివలింగం ఆ తరువాత కాలంలో కనుమరుగైపోయింది. ఆ శివలింగం తిరిగి వెలుగుచూసిన వైనం, ఈ క్షేత్రం మహిమాన్వితమైనదనే విషయాన్ని స్పష్టం చేస్తూ ఉంటుంది. చాలాకాలం క్రితం చాళుక్య విష్ణువర్ధనుడు తన పరివారంతో కలిసి ఈ ప్రదేశం మీదుగా వెళుతూ ఇక్కడ కాసేపు విశ్రమించాడట.

అక్కడికి కాస్త దూరంలో ఆవులు గడ్డిమేస్తూ ఉండటం ఆయనకి కనిపిస్తుంది. ఆవులు వలయాకారంలో నుంచుని గడ్డిమేస్తూ ఉండటం ... మధ్యలో గల ఖాళీ ప్రదేశంలోకి ఒక్క ఆవు కూడా రాకపోతుండటం ఆయనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కారణమేవిటో తెలుసుకోవడం కోసం సేనాధిపతితో కలిసి ఆ ప్రదేశానికి చేరుకుంటాడు. అక్కడ ఆయనకి 'అగస్త్యేశ్వర లింగం' కనిపిస్తుంది.

అత్యంత భక్తి శ్రద్ధలతో ఆయన స్వామికి నమస్కరిస్తాడు. తనని ఆ దారిలో రప్పించింది ఆ దేవదేవుడేననే విషయం ఆయనకి అర్థమైపోతుంది. అక్కడి స్థల మహాత్మ్యం గురించి తెలుసుకున్న విష్ణువర్ధనుడు, వెంటనే స్వామికి ఆలయాన్ని నిర్మించడానికి ఏర్పాట్లను ప్రారంభిస్తాడు. అలా నందివెలుగులోని అగస్త్యేశ్వరుడు వెలుగుచూడటం ... అనతికాలంలోనే అశేషభక్తుల విశ్వాసాన్ని చూరగొంటూ ప్రసిద్ధిచెందడం జరిగింది.


More Bhakti News