సాలగ్రామం కృష్ణుడిగా మారిన వైనం !

కృష్ణ భగవానుడి లీలావిశేషాలు ఆనందాన్ని కలిగిస్తూ వుంటాయి ... ఆశ్చర్యచకితులను చేస్తుంటాయి. ముఖ్యంగా ఆయన లీలలకు 'బృందావనం' విశాలమైన వేదికగా కనిపిస్తూ వుంటుంది. శ్రీకృష్ణుడి పాదస్పర్శతో పరమపునీతమైన ఈ క్షేత్రంలో 'రాధా రమణ' ఆలయం భక్తి భావ పరిమళాలను వెదజల్లుతూ వుంటుంది.

అశేష భక్త జనకోటికి అనిర్వచనీయమైన అనుభూతిని అందిస్తోన్న ఈ ఆలయాన్ని 'గోపాలభట్టు గోస్వామి' అనే భక్తుడు నిర్మించినట్టుగా స్థలపురాణం చెబుతోంది. క్రీ.శ.15 వ శతాబ్దానికి చెందిన గోపాలభట్టు బృందావనంలో కూర్చుని అనుక్షణం ... కృష్ణుడిని స్మరిస్తూ .. జపిస్తూ తన్మయత్వంలో తరిస్తూ ఉండేవాడు.

అలాంటి ఆ మహాభక్తుడికి కృష్ణుడు ప్రత్యక్ష దర్శన భాగ్యాన్ని కలిగించడమే కాకుండా, ఒక సాలగ్రామాన్ని ఆయనకి బహుకరించి ఇక మీదట దానిని పూజిస్తే తనని ప్రత్యక్షంగా సేవించిన ఫలితం దక్కుతుందని చెబుతాడు. పరమ సంతోషంతో ఆ సాలగ్రామాన్ని అందుకున్న గోపాలభట్టు, దానిని అపురూపంగా చూస్తూ ... అంకితభావంతో పూజించసాగాడు. ఒక రోజున ఆయన ఆ సాలగ్రమానికి కృష్ణుడి రూపం వస్తే బాగుంటుందని అనుకున్నాడట. అంతే ... ఆ సాలగ్రమానికి కళ్లు .. చెవులు ... ముక్కు ఏర్పడ్డాయి.

నిస్వార్థమైన భక్తినీ ... భక్తులను స్వామి వెంటనే అనుగ్రహిస్తాడనటానికి ఈ సంఘటన నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తూ వుంటుంది. ఆనాటి నుంచి ఈనాటి వరకూ ఈ వైనాన్ని గురించి ఇక్కడ ఆసక్తికరంగా చెప్పుకుంటూనే వుంటారు. ఈ సంఘటన జరిగిన రోజు ... 'వైశాఖ పౌర్ణమి' కావడం వలన, ప్రతి ఏటా ఈ రోజున ఇక్కడ ప్రత్యేక పూజలను ... విశేష ఉత్సవాలను అంగరంగవైభవంగా నిర్వహిస్తుంటారు.


More Bhakti News