ఆరోగ్యాన్ని ప్రసాదించే ఆదిదేవుడు

పరమశివుడు ఆవిర్భవించిన పరమపవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో 'బెజ్జికల్' ఒకటిగా కనిపిస్తూ వుంటుంది. నల్గొండ జిల్లా త్రిపురారం మండలంలో ఈ క్షేత్రం విలసిల్లుతూ వుంటుంది. ఇక్కడి శివుడు ... పార్వతీ జడల రామలింగేశ్వరుడుగా పూజాభిషేకాలు అందుకుంటూ వుంటాడు. చోళుల పరిపాలనా కాలంలో ఈ క్షేత్రం వైభవంతో వెలుగొందినట్టుగా చెబుతుంటారు.

ఇక్కడ స్వామివారు ఆవిర్భవించడం గురించి కొన్ని ఆసక్తికరమైన కథనాలు వినిపిస్తూ వుంటాయి. పౌరాణిక నేపథ్యం ... చారిత్రక వైభవాన్ని కలిగిన ఈ క్షేత్రం మారుమూల ప్రాంతంలో ఉండటం వలన పరిసర ప్రాంతాల్లోని భక్తులే పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుంటూ వుంటారు. క్షేత్ర విశిష్టతకు తగిన స్థాయిలో ప్రచారాన్ని కల్పించినట్టయితే, దూర ప్రాంతాలనుంచి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చే అవకాశం కనిపిస్తుంది.

ఇక్కడి స్వామిని దర్శించడం వలన అనారోగ్యాలు తొలగిపోయి ... ఆనందకరమైన జీవితం లభిస్తుందని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు. విశేషమైనటు వంటి పర్వదినాల్లో స్వామివారికి ప్రత్యేక పూజలు ... సేవలు నిర్వహిస్తుంటారు. స్వామి అనుగ్రహం కారణంగా బాధల నుంచి బయటపడిన వాళ్లు ఈ ఉత్సవాలకు తప్పనిసరిగా హాజరవుతూ వుంటారు. ఇక తమ మనసులోని మాటను స్వామికి చెప్పుకునేవారు కూడా ఈ ఉత్సవాల సందర్భంలోనే ఆయన సన్నిధిలోకి అడుగుపెడుతుంటారు. భక్తుల కోలాహలం మధ్య సందడిగా ... సంబరంగా జరిగే ఈ ఉత్సవాలను చూసితీరవలసిందే.


More Bhakti News