దశావతార పూజా ఫలితం !
లోక కల్యాణం కోసం శ్రీమహావిష్ణువు అనేక అవతారాలను ధరిస్తూ వచ్చాడు. వాటిలో 'దశావతారాలు' అత్యంత విశిష్టతను సంతరించుకుని కనిపిస్తూ వుంటాయి. మత్స్యావతారం ... కూర్మావతారం ... వరాహావతారం ... నృసింహావతారం ... వామనావతారం ... పరశురామావతారం ... రామావతారం ... కృష్ణావతారం ... బుద్ధావతారం ... కల్కి అవతారం .. దశావతారాలుగా చెప్పబడుతున్నాయి.
వీటిలో కల్కి అవతారాన్ని స్వామివారు ధరించనున్నట్టు పురాణాలు చెబుతున్నాయి. ఇక స్వామివారు ధరించిన ఏ అవతారాన్ని తీసుకున్నా లోక కల్యాణమే దాని వెనుక ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తూ ఉంటుంది. దుష్ట శిక్షణ ... శిష్ట రక్షణ చేయడం కోసం ... ధర్మాన్ని పరిరక్షించడం కోసం ఆయా సందర్భాల్లో శ్రీమన్నారాయణుడు ఈ అవతారాలను ధరించడం జరిగింది. అందుకు ఆ స్వామికి కృతజ్ఞతలు తెలుపుతూ ... సదా ఆయన అనుగ్రహాన్ని ఆశిస్తూ 'దశావతార వ్రతం' చేయాలని ఆధ్యాత్మిక గ్రంధ్యాలు చెబుతున్నాయి.
భాద్రపద శుద్ధ దశమినాడు పూజా మందిరాన్ని అలంకరించుకుని ... దశావతారాల చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఉపవాస దీక్షను చేపట్టి .. అత్యంత భక్తి శ్రద్ధలతో దశావతారాలను పూజించవలసి వుంటుంది. ఈ విధంగా చేయడం వలన సమస్త పాపాలు నశించి, శ్రీమన్నారాయణుడి అనుగ్రహం కారణంగా సకలశుభాలు కలుగుతాయని చెప్పబడుతోంది.