ఆయన జీవితం అలా మలుపు తిరిగింది !
జీవితంలో అనుకోకుండా కొన్ని సంఘటనలు జరిగినప్పుడు ... అవి హృదయాన్ని కలచివేసినప్పుడు ఆ బాధను భగవంతుడితో చెప్పుకోవాలనిపిస్తుంది. కృష్ణా జిల్లా 'మొవ్వ' గ్రామానికి చెందిన 'వరదయ్య'కి కూడా అలాంటి పరిస్థితులే ఎదురుకావడంతో ఆయన మనసు తీవ్రంగా గాయపడుతుంది. ఎవరికీ ఎలాంటి కష్టం కలిగించని తనకి ఆ వేణుగోపాలుడు ఎందుకిలా పరీక్షలు పెడుతున్నాడనే ఆలోచన ఆయనకి స్థిమితం లేకుండా చేస్తుంది.
దాంతో ఆలయానికి వెళ్లి వేణుగోపాలుడి సన్నిధిలో తన ఆవేదనని వ్యక్తం చేస్తాడు. ఆ సమయంలో అక్కడే వున్న ఒక సాధువు ఆయన బాధను అర్థం చేసుకుంటాడు. పరమాత్ముడైనటు వంటి కృష్ణుడుకి తెలియకుండా ఏదీ జరగదనీ ... ప్రతి సంఘటన వెనుక ఏదో పరమార్థం వుండి తీరుతుందని చెబుతాడు. భగవంతుడిని సేవించడం ద్వారా ఆయన తత్త్వం అర్థమవుతుందనీ, జీవితానికి అర్థం ఏమిటనేది బోధపడుతుందని అంటాడు.
ఆ సాధువు బోధించిన మూలమంత్రాన్ని వరదయ్య వదలకుండా స్మరిస్తూ ... వేణుగోపాలుడిని ప్రసన్నం చేసుకుంటాడు. ఆయన అనుగ్రహంతో కవితా శక్తిని పొంది ... వేణుగోపాలుడిని కీర్తిస్తూ ... అనేక క్షేత్రాలను దర్శిస్తూ 'క్షేత్రయ్య'గా భగవంతుడి హృదయంలోను ... భక్తుల మనసుల్లోను శాశ్వతమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు.