ఈ గణపతి అనుగ్రహిస్తే చాలు !

ఒకసారి కపిల మహర్షి .. వినాయకుడిని గురించి కఠోర తపస్సు చేయసాగాడు. ఆ మహర్షి తపస్సుకి మెచ్చి వినాయకుడు ప్రత్యక్షమై విషయమేవిటని అడుగుతాడు. తన దగ్గర 'చింతామణి' ఉండేదనీ ... దాని మహాత్మ్యం కారణంగా తన ఆశ్రమానికి వచ్చిన అతిథులకు లేదనకుండా అన్నసంతర్పణ చేస్తూ వస్తున్నానని చెబుతాడు.

అలాంటి చింతామణిని 'గణరాజు' తన కండబలాన్ని ఉపయోగించి తీసుకువెళ్లిపోయాడని అంటాడు. ఆశ్రమవాసుల ఆకలి తీర్చే ఆ చింతామణిని ఇప్పించవలసిందిగా కోరతాడు. ఆ మహర్షికి అభయాన్నిచ్చిన వినాయకుడు, కపిల మహర్షి దగ్గర నుంచి తీసుకువెళ్లిన చింతామణిని తిరిగి అతనికి అప్పగించమని గణరాజుకి కబురుచేస్తాడు.

ఆయన పెడచెవిన పెట్టడంతో యుద్ధానికి దిగుతాడు. గణరాజుని సంహరించి చింతామణిని కపిలుడుకి అందజేస్తాడు. ఆ చింతామణిలానే భక్తుల కోరికలను నెరవేరుస్తూ అక్కడే కొలువుదీరి ఉండవలసిందిగా ఆ మహర్షి అభ్యర్థిస్తాడు. ఆయన కోరికపై ఆవిర్భవించిన 'చింతామణి గణపతి' క్క్షేత్రం మనకి పూణే సమీపంలో గల 'ధేవూర్' లో దర్శనమిస్తుంది.

భక్తుల కోరికలు నెరవేర్చడం కోసమే వెలసిన వినాయకుడు కావడం వలన ఈ స్వామిని దర్శించుకునే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా వినాయక చవితి రోజుల్లో భక్తుల రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. మనసులోని మాటను చెప్పుకున్నందుకు భక్తుల మనసు తేలికపడుతుంది. స్వామి అనుగ్రహంతో అది త్వరలోనే నెరవేరుతుందనే విశ్వాసంతో వాళ్లంతా వెనుదిరుగుతూ ఉండటం విశేషం.


More Bhakti News