భక్తుడి కోరికను మన్నించిన గణపతి
ఒకసారి మహర్షులు ... మునులు ఒక విషయానికి సంబంధించిన చర్చ చేస్తుండగా, ముని పుత్రుడైన 'గృత్సమదుడు' తన వాదనను వినిపించడానికి ప్రయత్నిస్తాడు. దాంతో అక్కడి వాళ్లలో కొందరు ... అతను ముని పుత్రుడు కాకపోవడం వలన ఆ చర్చలో పాల్గొనే అర్హత లేదని చెబుతారు.
అవమానభారంతో ఇంటికి చేరుకున్న కొడుకుని చూసి 'ముకుంద' విషయమేమిటని అడుగుతుంది. తన తండ్రి 'వాచక్నవి' కాదనే నిందను తాను భరించలేకపోతున్నాననీ, దయచేసి తన తండ్రి ఎవరో తెలుపవలసినదిగా కోరతాడు. కన్నకొడుకు అలా నిలదీయడంతో ఆమె నివ్వెరపోతుంది. అప్పుడే ఆకాశవాణి అతని జన్మ రహస్యాన్ని గురించి పలుకుతుంది.
ఒకసారి 'రుక్మాంగదుడు' అనే రాజు వేట నిమిత్తం అడవిలోని వాచక్నవి ఆశ్రమం దిశగా వచ్చినప్పుడు, ఆ ముని భార్య ఆయన పట్ల ఆకర్షితురాలు అవుతుంది. అది తెలుసుకున్న దేవేంద్రుడు ... రుక్మాంగదుడి రూపంలో ముకుందకు చేరువ అవుతాడు. వారి సంతానమే 'గృత్సమదుడు' అని అసలు విషయాన్ని ఆకాశవాణి చెబుతుంది. విషయం తెలుసుకున్న గృత్సమదుడు మానసిక ప్రశాంతత కోసం వినాయకుడిని గురించి సంవత్సరాల తరబడి తపస్సుచేస్తాడు.
ఆయన తపస్సుకు మెచ్చి సాక్షాత్కరించిన వినాయకుడు, ఆయన అభ్యర్థన మేరకు అక్కడే ఆవిర్భవిస్తాడు. అలా ఇక్కడ కొలువుదీరిన వినాయకుడు .. 'వరద వినాయకుడు' గా భక్తులచే నిత్య నీరాజనాలు అందుకుంటున్నాడు. రాయఘడ్ జిల్లా పరిధిలోని 'మహాడ్'లో ఈ క్షేత్రం అలరారుతోంది. స్వామి మహిమలు భక్తుల అనుభవాలుగా ఇక్కడ వినిపిస్తూ వుంటాయి ... ఆనందాశ్చర్యాలను కలిగిస్తూ వుంటాయి.