ఆనందాశ్చర్యలను కలిగించే క్షేత్రం
శ్రీమహావిష్ణువు ... వేణుగోపాలుడిగా కొలువుదీరిన ప్రతీక్షేత్రం ఎంతో విశిష్టతను సంతరించుకుని కనిపిస్తూ ఉంటుంది. తన వేణుగానంతో గోవులను ... గోపాలకులను ... మహాభక్తులను మంత్రముగ్ధులను చేసిన కృష్ణుడుని అందరూ ఎంతగానో ఇష్టపడుతూ ఉంటారు. వేణువు వాయిస్తోన్న ఆయన సమ్మోహన సౌందర్య రూపాన్ని మనోఫలకంపై దాచుకుంటూ వుంటారు. తమ కష్టాలను గట్టెక్కించమని ఆ జగన్నాథుడిని ప్రార్ధిస్తూ వుంటారు.
అలా భక్తుల మనసు దోచుకున్న వేణుగోపాలుడి ఆలయం మనకి 'బూరుగు గడ్డ'లో కనిపిస్తుంది. నల్గొండ జిల్లా హుజూర్ నగర్ మండలంలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది. పూర్వం ఈ ప్రాంతమంతా 'భ్రుగు మహర్షి' సంచరించిన ప్రాంతంగా చెబుతుంటారు. కొంతకాలం పాటు ఆయన ఇక్కడ తపస్సు చేసుకున్న కారణంగా ఈ ప్రదేశానికి 'భ్రుగు గడ్డ' అనే పేరు వచ్చి ... కాలక్రమంలో వాడుకగా అది 'బూరుగు గడ్డ' గా మార్పుచెందింది.
ఈ క్షేత్రంలో ఇరవై నాలుగు అడుగుల అనంతపద్మనాభస్వామి కొలువుదీరి ఉన్నాడనే విషయం ఎవరికైనా ఆనందాశ్చర్యాలను కలిగిస్తుంది. ఎందరో రాజులు ఆయనని సేవించి తరించారు. ఎంతో ప్రాచీనతను సంతరించుకున్న ఈ ఆలయం ప్రాంగణంలోనే 'వేణుగోపాలస్వామి' మూర్తి కూడా బయటపడింది. పది అడుగుల పొడవైన ఈ విగ్రహం ... దృష్టి మరల్చుకోలేనంత మనోహరంగా కనిపిస్తూ వుంటుంది.
ఇలాంటి విగ్రహం పరిసర ప్రాంతాల్లో ఎక్కడా లేదని చెబుతుంటారు. అణువణువునా సౌందర్యాన్ని ఆవిష్కరించే ఈ మూర్తిని చూడగానే భక్తులు కష్టాలను మరిచిపోయి ... కళ్లలో ఆయన రూపాన్ని బంధించేపనిలో పడిపోతారు. నిత్యపూజలు ... పర్వదినాల్లో ప్రత్యేక సేవలు ... ఉత్సవాలను ఘనంగా జరుపుతుంటారు.
ఇక్కడి స్వామిని దర్శించుకుంటే కష్టాలు తొలగిపోయి .. సుఖసంతోషాలతో కూడిన జీవితం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు. పౌరాణిక నేపథ్యాన్ని ... చారిత్రక వైభవాన్ని సంతరించుకున్న ఈ క్షేత్రానికి మరింత ప్రాచుర్యం లభిస్తే, లక్షలాది భక్తుల హృదయాలలో ఈ క్షేత్రం చెరగని స్థానాన్ని సంపాదించుకోగలుగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.