బాలుడి రూపంలో వచ్చిన గణపతి
భగవంతుడు ... తన భక్తులు బాధల్లో వున్నప్పుడు ఆదుకోవడానికి ఏదో ఒక రూపంలో వస్తూనే వుంటాడు. అలా వినాయకుడు తనని ఎంతో భక్తితో ఆరాధిస్తోన్న ఓ బాలుడి కోసం బాలుడి రూపంలోనే వచ్చిన సంఘటన మనకి పూణే సమీపంలో గల 'పాలీ' క్షేత్రంలో కనిపిస్తుంది. వినాయకుడి మనసును అంతగా గెలుచుకున్న ఆ బాల భక్తుడి పేరు 'బల్లాల్'. ఆ భక్తుడి పేరుతోనే ఇక్కడి వినాయకుడు 'బల్లాలేశ్వర్' గా పిలవబడుతూ వుంటాడు.
భక్తుడి పేరుతో భగవంతుడు పిలవబడుతున్నాడంటే, భక్తుడికి భగవంతుడు ఇచ్చే స్థానం ఎలా వుంటుందో అర్థంచేసుకోవచ్చు. బల్లాల్ అనే ఓ బాలుడికి గణపతి ఆకారంలో గల ఒక రాయి దొరుకుతుంది. స్నేహితులతో కలిసి ఆ రాయికి నమస్కరిస్తూ ... ప్రదక్షిణలు చేస్తూ బల్లాల్ కాలం గడిపేవాడు. ఇది నచ్చని బల్లాల్ తండ్రి, కొడుకు పూజించే రాయిని విసిరి పారేసి అతణ్ణి చెట్టుకి కట్టేసి కొట్టి వెళ్లిపోతాడు.
అప్పుడు వినాయకుడు బాలుడి రూపంలో వచ్చి బల్లాల్ ని స్పర్శిస్తాడు. అంతే అతని కట్లు విడిపోతాయి ... గాయాలు మాయమైపోతాయి. బల్లాల్ కి ప్రత్యక్ష దర్శనమిచ్చిన వినాయకుడు అక్కడే ఆవిర్భవిస్తాడు. ఈ ఆలయం పక్కనే గల ప్రత్యేక మందిరంలో బల్లాల్ కి దొరికిన రాతి గణపతిమూర్తి కూడా దర్శనమిస్తూ వుంటుంది. వినాయకుడు పిల్లలను ఎంతగా ఇష్టపడతాడో ... వాళ్లు తమకి తోచిన విధంగా ఆరాధించినా ఎంతలా మురిసిపోతాడో చెప్పడానికి ఈ క్షేత్రం ఒక నిదర్శనంగా కనిపిస్తూ వుంటుంది. దర్శన మాత్రంచేతనే ధన్యులను చేస్తుంటుంది.