చవితి చంద్రుడి దోషం ఇలా రాదట !
వినాయకుడంటే పార్వతీదేవికి ప్రాణం ... పుష్కరకాలం పాటు తపస్సు చేసి ఆయన అనుగ్రహంతోనే ఆయన్ని బిడ్డగా పొందింది. అందువలన ఆమె ఆయనని ఎంతో గారం చేస్తూ వుండేది. మాట వరసకి కూడా ఆయనని ఎవరైనా ఏమైనా అంటే ఆమె అస్సలు సహించేది కాదు. అలాంటి వినాయకుడు కడుపునిండుగా తినేసి నడవలేక ఇబ్బంది పడుతుండటాన్ని చూసి నవ్విన చంద్రుడిపట్ల ఆమె ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తుంది.
'భాద్రపద శుద్ధ చతుర్థి' రోజున ఎవరైతే చంద్రుడిని చూస్తారో ... వాళ్లు నీలాపనిందలకు గురవుతారని శపిస్తుంది. ఆ శాప కారణంగానే చవితి చంద్రుడిని చూసిన మహర్షుల భార్యలు, అపనిందల కారణంగా వారికి దూరమవుతారు. సాక్షాత్తు శ్రీకృష్ణుడు సైతం పాలు తాగబోతూ అందులో చంద్రుడిని చూసిన కారణంగా 'శ్యమంతకమణి' విషయంలో నిందను మోయవలసి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో శాపానికి నివారణోపాయం చెప్పమని అంతా పార్వతీదేవిని ప్రార్ధిస్తారు.
ఈ రోజున వినాయక వ్రతం చేసుకుని ... అక్షింతలు తలపై ధరించిన వారికి చంద్రుడిని చూసినా దోష ప్రభావం ఉండదని చెబుతుంది. అంతే కాదు .. ఈ రోజున చవితి చంద్రుడిని చూసిన వాళ్లు ఆ దోషం నుంచి బయటపడాలంటే ఒక శ్లోకం చదువుకోవాలని 'విష్ణుపురాణం' చెబుతోంది. ''సింహః ప్రసేనమవధీత్ సింహో జాంబవతా హతః సుకుమారక మా రోదీస్తవ హ్యేష శ్యమంతకః'' అనే శ్లోకాన్ని పఠించడం వలన చవితినాటి చంద్రుడిని చూసిన దోషం తొలగిపోతుందని చెప్పబడుతోంది.