విష్ణువు నిర్మించిన గణపతి ఆలయం

వినాయకుడిని చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకూ అంతా ఇష్టపడతారు. ఆయనని పూజించడం పట్ల ఆసక్తి చూపుతారు. వినాయకుడి ఆవిర్భావం నుంచి ఆయనకి ఏనుగు తలను అమర్చడం ... గణ నాయకుడిగా నియమించడం ... ఆయన అవస్థలు చూసి చంద్రుడు నవ్వడం ... ఆయనని పార్వతీదేవి శపించడం వంటి ఘట్టాలతో సాగిపోయే పురాణ కథనాన్ని శ్రద్ధగా వింటారు.

అలాంటి వినాయకుడు ప్రశాంతంగా కనిపిస్తున్నప్పటికీ, అవసరమైనప్పుడు ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తూ అసురసంహారం చేసిన సందర్భాలు చాలానే వున్నాయి. దేవతలకి సహాయాన్ని అందించడమేకాదు సాక్షాత్తు శ్రీమహావిష్ణువుకి సైతం కార్యసిద్ధిని కలిగించడం ఆయన గొప్పతనం. సమస్త దేవతలచే పూజించబడే శ్రీమన్నారాయణుడే వినాయకుడికి ఆలయాన్ని నిర్మించాడంటే ఆయన విశిష్టతను అర్థం చేసుకోవచ్చు.

శ్రీమహావిష్ణువు చెవుల నుంచి ఉద్భవించిన 'మధు కైటభులు' ... బ్రహ్మను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టసాగారు. ఆయన అభ్యర్థన మేరకు మధుకైటభులపై శ్రీమహావిష్ణువు యుద్ధానికి సిద్ధపడతాడు. మధుకైటభులకి గల వరాన్ని దృష్టిలో పెట్టుకుని, వాళ్లని తన 'తొడ'పై సంహరిస్తాడు. శ్రీమహావిష్ణువు కోరిక మేరకు ఈ యుద్ధంలో ఆయనకి విజయం సిద్ధించేలా గణపతి చూస్తాడు. అందుకు కృతజ్ఞతగా శ్రీమన్నారాయణుడు ఆయనకి ఆలయాన్ని నిర్మిస్తాడు. ఆ క్షేత్రమే 'సిద్ధి టెక్' గా పిలవబడుతోంది.

పూణేకి వంద కిలోమీటర్ల లోపు పరిధిలో ఈ క్షేత్రం దర్శనమిస్తూ వుంటుంది. ప్రస్తుతం కనిపించే ఆలయం పేష్వాలు పునరుద్ధరించిన తరువాతదిగా చెప్పబడుతోంది. ఇక్కడి వినాయకుడి తొండం కుడి వైపుకి తిరిగి వుండటం వలన, అష్టగణపతి క్షేత్రాలలో ఒకటిగా చెప్పబడుతోన్న ఈ క్షేత్రం మరింత ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తూ వుంటుంది. విశిష్ట వినాయకుడి విశేషాలను ఆసక్తికరంగా ఆవిష్కరిస్తూ వుంటుంది.


More Bhakti News