రామనామ సంకీర్తన తరింపజేస్తుంది

రామనామం మధురంగా వుంటుంది ... పలకడానికి ఎంతో తేలికగా వుంటుంది. అలాంటి రామనామాన్ని స్మరిస్తూ తమ జీవితాలను తరింపజేసుకున్న భక్తులు ఎంతోమంది వున్నారు. అలాంటివారిలో కబీరుదాసు ... రామదాసు ప్రధానంగా కనిపిస్తూ వుంటారు. కబీరుదాసును ... రామదాసును పరిశీలిస్తే వీరిద్దరి మధ్య ఏదో తెలియని ఆత్మీయత కనిపిస్తూ వుంటుంది.

భగవంతుడు కబీరు ద్వారా రామదాసును ప్రభావితం చేసినట్టుగా స్పష్టమవుతూ వుంటుంది. రామదాసుని కబీరు కలుసుకోవడం ... త్వరలోనే ఆయన జీవితాన్ని రామచంద్రుడు మలుపు తిప్పుతాడని చెప్పడం ఈ నమ్మకానికి మరింత బలాన్ని చేకూరుస్తున్నట్టుగా అనిపిస్తుంది. భద్రాచలంలో రామాలయాన్ని నిర్మించడానికి నడుంబిగించిన రామదాసును ఆయన ఎంతగానో అభినందిస్తాడు.

రామదాసుని తానీషా ప్రభువు బంధించినప్పుడు, ప్రభువుకి ఎంతగానో నచ్చచెబుతాడు. కారాగారంలో వున్న రామదాసుని కలుసుకోవడానికి వెళతాడు. అక్కడ రామనామ సంకీర్తనలో తేలిపోతున్న రామదాసును చూసి ఆనందాశ్చర్యలకి లోనవుతాడు. తానీషా ప్రభువు విధించిన రెండు షరతులకు అంగీకరిస్తే అక్కడి నుంచి బయటికి రావచ్చనే విషయాన్ని ఆయన మాటగానే చెబుతాడు.

ఏదో ఒక ఆలోచన చేసి ... రాముడి పట్ల విశ్వాసాన్ని తగ్గించుకుని కారాగారవాసం నుంచి బయటపడాలని తాను అనుకోవడంలేదని చెబుతాడు రామదాసు. తనని విడిపించడానికి ఆ రాముడే దిగివస్తాడనీ, ఆ నమ్మకం తనకి ఉందని అంటాడు. రాముడి పట్ల ఆయన పెంచుకున్న విశ్వాసం కబీరుకి ఆనందాన్ని కలిగిస్తుంది. త్వరలోనే ఆయన నిరీక్షణ ఫలిస్తుందని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. రామనామ సంకీర్తన ఆ స్వామి మనసును కరిగిస్తుంది. రామదాసు కోరుకున్నట్టుగానే ఆయనని చెర నుంచి విముక్తుడిని చేస్తుంది.


More Bhakti News