నష్టాలను నివారించే గణపతి
ఆధ్యాత్మిక ప్రపంచంలో వినాయకుడే అసలైన కథానాయకుడిగా కనిపిస్తుంటాడు. సాధు జనులను సంరక్షించడంలోను ... అసురులను సంహరించడంలోను ఆయన కీలకమైన పాత్రను పోషించాడు. తనని శరణు కోరినవారి వెన్నంటి వుండి వారికి అవసరమైనవి అందిస్తూ .. ఆనందాన్ని కలిగిస్తూ వుంటాడు.
అలాంటి వినాయకుడిని అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ వుంటారు. ముఖ్యంగా వ్యాపార వ్యవహారాలు కొనసాగించే వాళ్లు ఆయనకి నమస్కరించకుండా దైనందిన కార్యక్రమాలను మొదలుపెట్టరు. అలాంటి వ్యాపారస్తుల విశ్వాసాన్ని చూరగొన్న వినాయకుడి ఆలయం మనకి నల్గొండ జిల్లా 'మిర్యాలగూడ'లో కనిపిస్తుంది. చక్కగా తీర్చిదిద్దబడిన ఇక్కడి ఆలయంలో గణపతి కొలువై భక్తులకు దర్శనమిస్తూ వుంటాడు.
మిర్యాలగూడలో గణేష్ మార్కెట్ అంటే తెలియని వాళ్లు వుండరు. ఇక్కడ దొరకని వస్తువు ఉండదని చెప్పుకుంటూ వుంటారు. అంత పెద్దదిగా చెప్పబడుతోన్న ఈ మార్కెట్ లోని వ్యాపారస్తులంతా కూడా, తమ వ్యాపారం లాభసాటిగా కొనసాగడానికి కారణం గణపతి అనుగ్రహమేనని నమ్ముతుంటారు. ఆ స్వామిని స్మరించుకుని దైనందిన వ్యాపారాన్ని ఆరంభిస్తే ఎలాంటి నష్టాలు రాకుండా లాభాల బాటలో నడిపిస్తూ ఉంటాడని చెబుతుంటారు.
ఆ స్వామి పట్ల తమకి గల ప్రేమానురాగాలను చాటుకోవడానికీ ... కృతజ్ఞతలు తెలుపుకోవడానికి తమకి లభించిన మంచి అవకాశంగా వాళ్లు 'వినాయక చవితి' పండుగను భావిస్తుంటారు. గణపతి నవరాత్రుల సమయంలో అంతా కలిసి ప్రత్యేక పూజలు ... ఉత్సవాలు ఘనంగా జరిపిస్తుంటారు. తొమ్మిదిరోజుల పాటు ఈ వేడుక నేత్రపర్వంగా కొనసాగుతూ గణపతి పట్ల అక్కడివారికిగల భక్తి విశ్వాసాలను చాటుతూ వుంటుంది.