ఈ రోజున సప్తరుషులను పూజించాలి
భాద్రపద మాసంలో కూడా వివిధ వ్రతాలను నిర్వహిస్తూ స్త్రీలు ఎంతో సందడిగా కనిపిస్తుంటారు. ఈ మాసంలో వాళ్లు నిర్వహించే వ్రతాలలో 'రుషి పంచమి' వ్రతం ఒకటిగా కనిపిస్తూ వుంటుంది. శ్రావణమాసంలో సంతాన సౌభాగ్యాలను గురించీ .. సిరిసంపదలను గురించి నోములను ఆచరించిన స్త్రీలు, ఈ మాసంలో 'రుషి పంచమి' వ్రతాన్ని తప్పక ఆచరిస్తూ వుంటారు.
శ్రావణ మాసంలో లక్ష్మీదేవినీ ... గౌరీదేవిని వ్రతాల ద్వారా ఆరాధించిన స్త్రీలు, 'భాద్రపదం'లో శుద్ధ పంచమి రోజున సప్త రుషులను పూజిస్తూ వుంటారు. దీనినే 'రుషి పంచమి' వ్రతం అని అంటారు. వశిష్ఠుడు ... విశ్వామిత్రుడు ... జమదగ్ని ... అత్రి ... గౌతమ ... భరద్వాజ ... కశ్యపులను సప్త మహర్షులుగా పేర్కొంటారు.
రుషి పంచమి రోజున సప్తరుషులను ... వారి భార్యలను పూజించాలని శాస్త్రం చెబుతోంది. అత్యంత భక్తిశ్రద్ధలతో ... నియమనిష్ఠలను పాటిస్తూ ఈ వ్రతాన్ని ఆచరించవలసి వుంటుంది. ఈ విధంగా చేయడం వలన రుతు క్రమ సమయంలో స్త్రీలు తెలియక చేసిన దోషాలు తొలగిపోయి ... పుణ్య ఫలాలు లభిస్తాయని చెప్పబడుతోంది.