ఇక్కడి వినాయకుడి విశిష్టత ఇదే !
పురాణాలు గణ నాయకుడిగా 'గణపతి' ఘనతను ఆవిష్కరిస్తూ వుంటాయి. ఆయన దర్శనం మాత్రం చేతనే సమస్తకార్యాలు సఫలీకృతమవుతాయని స్పష్టం చేస్తున్నాయి. అలాంటి వినాయకుడు ఎక్కడ కొలువైవున్నా భక్తులు పెద్దసంఖ్యలో వచ్చి ఆయనని దర్శించుకుంటూ ... ఆశీస్సులు అందుకుంటూ వుంటారు. ఈ నేపథ్యంలో ఆయన స్వయంభువుగా ఆవిర్భవించిన క్షేత్రాలు కొన్ని 'అష్టగణపతి క్షేత్రాలు'గా ప్రసిద్ధిచెందాయి.
మహారాష్ట్రలోని పూణే నగర పరిధిలో ఈ క్షేత్రాలన్నీ కొలువుదీరి ఉండటం విశేషం. ఈ ఎనిమిది ప్రదేశాల్లో ఒక్కొక్క చోట వినాయకుడు ఆవిర్భవించడానికి వెనుక ఒక్కో ఆసక్తికరమైన నేపథ్యం కనిపిస్తూ ఉంటుంది.'మోర్ గావ్' క్షేత్రం విషయానికే వస్తే ... సూర్యుడి అనుగ్రహ ఫలితంగా రాక్షస దంపతులకు 'సింధురాసురుడు' జన్మిస్తాడు. సూర్యుడి గురించి కఠోర తపస్సుచేసి అమృత కలశాన్ని అందుకుంటాడు. అది తన కడుపులో ఉన్నంత వరకూ తనకి మరణం లేకుండా వరాన్ని పొందుతాడు.
ఆ వరం వలన పెరిగిన గర్వతో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వుంటాడు. సింధురాసురుడి ఆగడాలను భరించలేకపోయిన దేవతలు వినాయకుడిని ఆశ్రయిస్తారు. తాను పార్వతీదేవి తనయుడిగా ఆవిర్భవించి అసురసంహారం చేస్తానని వినాయకుడు వారికి అభయాన్ని ఇస్తాడు. ఆ ప్రకారం ఆయన ఆవిర్భవించి ... మయూర వాహనంపై వెళ్లి సింధురాసురుడిని ఎదుర్కుంటాడు. ఆయన ఉదరంలో గల అమృత కలశాన్ని పగులగొట్టి సంహరిస్తాడు.
ఈ సంఘటనకు నిదర్శనంగా ఇక్కడ విశ్వకర్మ వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్టు స్థలపురాణం చెబుతోంది. మయూర వాహనంపై వచ్చాడు గనుక ఇక్కడి స్వామిని మయూరేశ్వరుడని పిలుస్తుంటారు. వజ్రాలు పొదగబడిన నేత్రాలతో స్వామి దర్శనమిస్తూ ఉండటం ఇక్కడి ప్రత్యేకతగా చెబుతుంటారు. భాద్రపద శుద్ధ చవితి రోజున ఇక్కడ జరిగే పల్లకీ ఉత్సవాన్ని చూసి తరించాలే గానీ ... వర్ణించడానికి మాటలు చాలవు.