శ్రీరాముడి అంగుళీయకం ప్రత్యేకత

శ్రీరాముడిని కలుసుకున్న దగ్గర నుంచి హనుమంతుడు ఆయన సేవలోనే తరిస్తుంటాడు. సీత జాడ తెలిసే వరకూ, రాముడి ముఖంలో సంతోషం చూసే వరకూ తాను విశ్రాంతి తీసుకోకూడదని నిర్ణయించుకుంటాడు. సీతమ్మవారిని వెతకడానికి లంకానగరం వైపు వెళ్లడానికి సిద్ధపడతాడు.

తాను రాముడు పంపించగా వచ్చిన దూతననే విషయాన్ని సీత విశ్వసించాలంటే, రాముడు బాగా ఉపయోగించే వస్తువుల్లో ... ఆమెకి బాగా తెలిసిన దానిని గుర్తుగా ఇవ్వమని హనుమంతుడు అడుగుతాడు. అప్పుడు రాముడు తన చేతికి గల ఉంగరాన్ని తీసి హనుమంతుడికి ఇస్తాడు. పైన ఒక పెద్దమణి ... కింద రెండు చిన్న మణులు పొదిగిన ఆ ఉంగరం అంటే రాముడికి ఎంతో ఇష్టం. ఎప్పుడూ కూడా ఆయన దానిని తన చేతి నుంచి తీసేవాడుకాదట. ఈ మూడు మణులు ఆయన నామాన్ని సూచిస్తూ ఉండేవట.

ఆ ఉంగరాన్ని సీత వెంటనే గుర్తిస్తుందని రాముడు చెప్పడంతో, దానిని తీసుకుని హనుమంతుడు బయలుదేరుతాడు. సీతమ్మవారి జాడ తెలుసుకుని ఆమెకి ఆ ఉంగరాన్ని చూపించి సంతోషాన్ని కలిగిస్తాడు. ఈ నేపథ్యంలో .. హనుమంతుడికి రాముడు ఇచ్చిన ఆ ఉంగరం మహాశక్తిమంతమైనదని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఆయన తన తపోశక్తినంతా ఆ ఉంగరంలో నిక్షిప్తం చేసేవాడట.

అత్యంత శక్తిమంతమైన ఆ ఉంగరం శత్రువుల నుంచి రక్షణ కల్పిస్తుంది. తన కోసం హనుమంతుడు శత్రువుల మధ్యకి వెళుతున్నాడు. శత్రువు యొక్క బలాబలాలు గురించిన వివరాలు తెలియవు. ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితులను హనుమంతుడు ఎదుర్కోవలసి వస్తుందో ఊహించడం కూడా కష్టసాధ్యమే. అలాంటి ప్రదేశానికి వెళుతోన్న హనుమంతుడి క్షేమాన్ని గురించి ఆలోచించవలసిన బాధ్యత తనపై ఉందని రాముడు భావిస్తాడు.

అందుకే ఆయన క్షణమైనా ఆలస్యం చేయకుండా తన దగ్గరున్న ఉంగరాన్ని హనుమంతుడికి ఇస్తాడు. తన గుర్తుగా సీతాదేవికి అందించాలనే కాదు, అది హనుమంతుడిని రక్షిస్తూ ఉంటుందనే ఉద్దేశం కూడా ఆయనకి రాముడు ఉంగరాన్ని ఇవ్వడంలో కనిపిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి.


More Bhakti News