ఇక్కడి జలపాతానికి ఈ ప్రత్యేకత వుందట !

భగవంతుడి లీలావిశేషాలను గురించి తెలుసుకోవడం కష్టసాధ్యమైన విషయం. ఆయన మనసుకి నచ్చిన ప్రదేశాల్లోనే కాకుండా, మహర్షుల అభ్యర్థన మేరకు అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించాడు. ఈ నేపథ్యంలో ఆ దేవదేవుడు అడవుల్లోనూ ... కొండకోనలలోను కొలువుదీరాడు. అలా పరమశివుడు కొలువుదీరిన క్షేత్రంగా 'లొద్ది' కనిపిస్తుంది. నల్లమల అడవీప్రాంతంలో గల'లొద్ది'లో ఆవిర్భవించిన ఇక్కడి శివుడిని 'లొద్ది మల్లయ్య'గా కొలుస్తుంటారు.

శ్రీశైలం వెళ్లే ప్రధాన రహదారి నుంచి కాలినడకన దాదాపు 30 కిలోమీటర్లు ప్రయాణించి ఈ క్షేత్రానికి చేరుకోవలసి వుంటుంది. పరమ శివుడి లీలావిశేషాల్లో ఒకటిగా ఈ క్షేత్రం కనిపిస్తూ వుంటుంది. ప్రతి సంవత్సరం 'తొలిఏకాదశి' రోజున ఈ క్షేత్రంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరుపుతుంటారు .. ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఆ సమయంలో ఈ ప్రాంతం సందడిగా కనిపిస్తూ వుంటుంది.

ఈ ప్రదేశాన్ని చేరుకున్నవాళ్లంతా లొద్ది జలపాతాన్ని చూసి సంతోషంతో పొంగిపోతారు. కొండచరియల మీదుగా దూకుతూ వచ్చే ఈ జలపాతం కింద నుంచుని స్నానాలు చేస్తుంటారు. అయితే ఈ జలపాతానికి ఒక ప్రత్యేకత ఉందని అంటారు. దాని కింద నుంచున్నది మహాపాతకాలు చేసిన వాళ్లయితే వాళ్లను తాకకుండా అది పక్కకి జరుగుతుందట.

ఇలాంటి జలపాతాల ప్రస్తావన కొన్ని పుణ్యక్షేత్రాల్లో ఇప్పటికీ వినిపిస్తూ వుంటుంది. ఇక లొద్ది జలపాతం విషయానికి వస్తే ... దీనికి ఈ ప్రత్యేకత ఉందనే విషయాన్ని 17 వ శతాబ్దంలో వ్రాయబడిన 'శ్రీపర్వత పురాణం'లో ప్రస్తావించినట్టు చెప్పబడుతోంది. ఈ విషయంలో నిజానిజాల మాట అలా ఉంచితే ... అద్భుతమైన ప్రకృతి సౌందర్యాన్ని ఆవిష్కరించే ఈ క్షేత్రాన్ని దర్శించడం అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహంలేదు.


More Bhakti News