ధర్మం తెచ్చిన కీర్తి ప్రతిష్ఠలే శాశ్వతం

లోహితాస్యుడి శవాన్ని కాటిలో వదిలి కాటి సుంకం కోసం తన యజమాని దగ్గరికి బయలుదేరుతుంది చంద్రమతి. పుత్రుడి శవాన్ని కనిపెట్టుకుంటూ ... చంద్రమతి కోసం ఎదురుచూస్తూ వుంటాడు హరిశ్చంద్రుడు. అలా వెళ్లిన చంద్రమతితో రాజభటులు రావడం ... వాళ్లతో కాటికాపరి అయిన వీరభాహుడు కూడా వుండటం చూసి హరిశ్చంద్రుడు నిర్ఘాంతపోతాడు.

కాశీ రాజకుమారుడిని హత్యచేసిన కారణంగా ఆమెకి మరణశిక్ష విధించబడిందనీ, ఆ శిక్షను అమలుపరచమంటూ హరిశ్చంద్రుడికి గొడ్డలిని ఇచ్చి వెళ్లిపోతాడు. తనకే పాపమూ తెలియదంటూ జరిగిన సంఘటనను ఆయనకి వివరిస్తుంది చంద్రమతి. విధి ఎంత బలీయమైనదంటూ హరిశ్చంద్రుడు పరమశివుడిని తలచుకుంటాడు.

కన్నబిడ్డను పోగొట్టుకుని ఆ బాధను భరించలేకపోతున్న సమయంలోనే, కట్టుకున్న భార్యను కడతేర్చవలసి వచ్చినందుకు ఆవేదన చెందుతాడు. ఏది ఏమైనా తన యజమాని అయిన వీరబాహుడు తనకి అప్పగించిన పనిని పూర్తిచేయడమే ధర్మమని భావిస్తాడు. భర్త మనసు తెలిసిన చంద్రమతి ... ఆ సమయంలోను ఆయన ధర్మం తప్పనందుకు ఆనందిస్తుంది.

హరిశ్చంద్రుడు ఆమెకి మరణశిక్షను అమలు జరపబోతుండగా, ఇంద్రాది దేవతలతో పాటు మహర్షులు అక్కడ ప్రత్యక్షమవుతారు. ఆయన ధర్మనిరతి ... సత్యనిష్ఠను గురించి విశ్వామిత్రుడికీ ... వశిష్ఠ మహర్షికి జరిగిన సంభాషణ గురించి చెబుతారు. ఆ పరీక్షలో భాగంగానే లోహితాస్యుడు ... కాశీరాజు కుమారుడు మరణించినట్టు చేయడం జరిగిందని చెబుతారు. వాళ్లిద్దరూ జీవించే వున్నారని చెబుతూ ... హరిశ్చంద్రుడిని అనేక విధాలుగా ప్రశంసిస్తూ ... లోకంలో ఆయన కీర్తిప్రతిష్ఠలు కలకాలం వర్ధిల్లుతాయని ఆశీర్వదించి వెళ్లిపోతారు.


More Bhakti News