గణపతి నవరాత్రుల్లో దీక్షా స్వీకారం
జీవితం ఎన్నో ఆటుపోట్లతో కొనసాగుతూ వుంటుంది. ఒకవైపున శారీరక పరమైన సమస్యలు ... మరొక వైపున మానసిక పరమైన సమస్యలు సతమతం చేస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే ఇష్టదైవానికి నమస్కరించుకుని, తనని గట్టెక్కిస్తే దీక్ష తీసుకుని సేవిస్తానని మొక్కుకుంటూ వుంటారు. మరికొందరు దీక్ష తీసుకునే భగవంతుడి చెంత తమ మనసులోని మాటను చెప్పుకుంటూ వుంటారు.
అలా అయ్యప్పస్వామి ... వేంకటేశ్వరస్వామి ... భవాని దీక్షలు తీసుకునేవాళ్ల సంఖ్య ఎక్కువగా వుంటుంది. ఈ నేపథ్యంలో వినాయకుడి దీక్షను తీసుకునేవాళ్లు కూడా ఎక్కువగానే కనిపిస్తుంటారు. గణపతి నవరాత్రుల సందర్భంగా పెద్దసంఖ్యలో గణపతి దీక్షలు తీసుకోవడం జరుగుతూ వుంటుంది. గణపతి నవరాత్రులను పురస్కరించుకుని విశిష్టమైనటువంటి గణపతి ఆలయాల్లో దీక్ష ధారణ జరుగుతుంటుంది.
అయ్యప్ప మాలను ధరించిన వాళ్లు నల్లని వస్త్రాలు .... వేంకటేశ్వరస్వామి దీక్షను స్వీకరించిన వాళ్లు పసుపు వస్త్రాలు ... భవాని మాలధారులు ఎర్రని వస్త్రాలు ధరిస్తుంటారు. ఇక గణపతి దీక్షను తీసుకున్నవాళ్లు తెల్లని వస్త్రాలను ... ఆరుద్ర వర్ణంలో గల ఉత్తరీయాన్ని వాడవలసి వుంటుంది. దీక్షచేసే రోజులను ఎవరి ఆసక్తిని బట్టి వాళ్లు అనుకోవచ్చు. దీక్షలో ఉన్నంతకాలం శారీరక పరమైన ... మానసిక పరమైన పవిత్రతకు ప్రత్యేక ప్రాధాన్యతని ఇవ్వవలసి వుంటుంది.
ఇతరులను పలకరించడం దగ్గర నుంచి నియమనిష్టలు అన్నీ కూడా మిగతా దీక్షలకు దగ్గరగానే ఉంటాయి. దీక్షాకాలం పూర్తయిన తరువాత గణపతి ఆలయానికి వెళ్లి అక్కడ దీక్ష విరమణ చేయవలసి వుంటుంది. అత్యంత భక్తి శ్రద్ధలను ... నియమనిష్టలను పాటిస్తూ దీక్షా సమయాన్ని పూర్తి చేస్తే, ఆశించిన ఫలితాలు అందుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు.