అదే ఈ వినాయకుడి ప్రత్యేకత !

ఇంద్రాది దేవతలు వినాయకుడిని పూజించకుండా ఏ పనిని ఆరంభించరు. ఇక మహర్షులు వినాయకుడిని ప్రార్ధించకుండా ఏ దైవాన్ని పూజించరు. సాధారణ మానవుల విషయానికి వస్తే, వాళ్లు వినాయకుడిని స్మరించకుండా ఏ కార్యాన్ని తలపెట్టరు ... ఆయన పాత్ర లేకుండా ఏ శుభాకార్యాన్ని నిర్వహించరు.

సంతోషంగా ఆయనని ఆరాధించి ... సగౌరవంగా ఆయనని ఆహ్వానించిన తరువాతనే ఏ కార్యక్రమాన్నయినా ఆరంభిస్తూ వుంటారు. ఆయన ఎక్కడ ఏ క్షేత్రంలో కొలువైనా దర్శించుకుని ధన్యులు అవుతుంటారు. ఆయన కొలువుదీరిన విశిష్టమైన క్షేత్రాల్లో 'పిళ్ళైయార్ పట్టి' ఒకటిగా చెప్పబడుతోంది. తమిళనాడు - తిరప్పత్తూరు సమీపంలో ఈ క్షేత్రం అలరారుతోంది.

ఇక్కడి వినాయకుడు మిగతా క్షేత్రాల్లో కంటే భిన్నంగా కనిపిస్తూ వుంటాడు. పూర్తి పద్మాసనం కాకుండా కూర్చుని, ఎడమచేయి నడుముపై పెట్టుకుని ... కుడిచేతిలో శివలింగాన్ని పట్టుకుని దర్శనమిస్తూ వుంటాడు. స్వామివారి విభిన్నమైన ఈ ముద్రలో కనిపించడం వెనుక పురాణ సంబంధమైన కథనం వుందని ఇక్కడి వాళ్లు చెబుతుంటారు.

అరుదైన వరాలను పొందిన మూషికాసురుడు దేవతలను ... సాధుసత్పురుషులను హింసించడం ఆరంభిస్తాడు. అంతా కలిసి వినాయకుడిని ఆశ్రయించగా ఆయన తన దంతాన్నే ఆయుధంగా ఉపయోగించి మూషికాసురుడుని సంహరిస్తాడు. ఆ పాపం నుంచి బయటపడటానికిగాను ఆయన ఒక శివలింగాన్ని ప్రతిష్ఠిస్తాడు. ఆ విశేషాన్ని చాటుతూ ఇక్కడి వినాయకుడు ఇలా చేతిలో శివలింగం పట్టుకుని కనిపిస్తూ ఉంటాడని చెబుతుంటారు. అలాంటి ఈ స్వామిని దర్శించడం మాత్రం చేతనే సమస్త పాపాలు నశించిపోతాయని భక్తులు విశ్వసిస్తూ వుంటారు.


More Bhakti News