భర్త ఆచూకీని ఆమె అలా తెలుసుకుంది !
దమయంతి సుఖంగా ఉండాలనే ఉద్దేశంతో అర్ధరాత్రివేళ అడవిలో ఆమెని ఒంటరిగా వదిలేసి నల మహారాజు వెళ్లిపోతాడు. ఆయన్ని వెతుక్కుంటూ బయలుదేరిన దమయంతి మరో రాజ్యానికి చేరుకుంటుంది. అక్కడి రాజకుటుంబీకులు ఆమెకి బంధువులే అయినా, ఆ విషయం తెలియకపోవడం వలన కొన్ని ఇబ్బందులను ఎదుర్కుంటుంది. భవానీదేవిపై భారంవేసి రోజులు గడుపుతుంటూ వుంటుంది.
అలాంటి పరిస్థితుల్లోనే దమయంతి తండ్రి తన కూతురినీ ... అల్లుడిని వెతికించడానికి అన్ని రాజ్యాలకు సేవకులను పంపుతాడు. ఫలితంగా దమయంతి ఆచూకీ తెలిసి ... ఆమె పుట్టింటికి చేరుకుంటుంది. బిడ్డలను దగ్గరికి తీసుకుని కన్నీళ్ల పర్యంతమవుతుంది. తాను ... పిల్లలు సాధ్యమైనంత త్వరగా నలుడిని చేరుకోవాలని అనుకుంటుంది.
తన తండ్రిచేసిన ప్రయత్నాల్లో నలుడి ఆచూకీ దొరకలేదంటే, ఆయన అజ్ఞాత రూపంలో వుండి ఉండవచ్చని ఊహిస్తుంది. అలాంటి నలుడి ఆచూకీ ఎలా తెలుసుకోవాలనే విషయంలో తర్జన భర్జనలు పడుతుంది. నలుడి ఆచూకీ తెలుసుకోవడానికి ఒకే ఒక మార్గం వుందని ఆమె భావిస్తుంది. తమ ఆస్థాన పండితులను ఇతర రాజ్యాలకు బయలుదేరదీస్తుంది. గుణవంతురాలైన భార్యను అర్థరాత్రి వేళ అడవిలో వదిలేసి భర్త వెళ్లిపోవడం న్యాయమా ? అనే ప్రశ్నను అన్ని రాజ సభలలోను లేవదీయమని వాళ్లతో చెబుతుంది.
ఈ ప్రశ్న పట్ల ఎవరైతే ఎక్కువగా స్పందిస్తారో ... భర్త పాత్రను సమర్ధిస్తూ మాట్లాడతారో ఆయనని నలమహారాజుగా గుర్తించమని చెబుతుంది. తెలివిగా ఆమె వేసిన ఆ పథకం ఫలిస్తుంది ... బాహుకుడి పేరుతో రుతుపర్ణుడి ఆశ్రయాన్ని పొందిన నలుడు ఈ ప్రశ్నపట్ల స్పందిస్తాడు. ఎలాంటి పరిస్థితుల్లో భర్త వదిలి వెళ్లాడో దమయంతి అర్థం చేసుకుని వుంటే బాగుండేదని అంటాడు. ఆ మాటతో ఆయనే నలమహారాజు అనే విషయం బయటపడిపోతుంది. అలా ఆమె తన భర్త ఆచూకీని తెలుకుని ఆయనని కలుసుకోగలుగుతుంది.