విముక్తిని కలిగించే విశిష్ట క్షేత్రం
సాధారణంగా ఏదైనా క్షేత్రానికి వెళితే అక్కడ ఏదో ఒక పుష్కరిణి కనిపిస్తూ వుంటుంది. లేదంటే కాస్త దూరం ... దూరంగా మరి కొన్ని తీర్థాలు కనిపిస్తూ వుంటాయి. ఒక్కో తీర్థంలో స్నానం చేయడం వలన ఒక విశేషం కలిగిన పుణ్యఫలం లభిస్తుందని చెప్పబడుతుంది. ఒక క్షేత్రంలో మాత్రం ... రెండు సరస్సులు పక్కపక్కనే కనిపిస్తూ కలిసిపోయినట్టుగా అనిపిస్తుంటాయి .. ఆ క్షేత్రమే 'సర్పవరం'.
ఇది తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు సమీపంగా అలరారుతోంది. పంచభావనారాయణ స్వామి క్షేత్రాల్లో ఇది ఒకటిగా ప్రసిద్ధిచెందింది. ఆలయ ప్రధాన గోపురానికి ఎదురుగా అత్యంత సమీపంగా ఈ సరస్సులు కనిపిస్తూ ఆశ్చర్యచకితులను చేస్తుంటాయి. ఎప్పుడు చూసినా స్వచ్ఛమైన నీటితో నిండుగా కనిపించే ఈ సరస్సులు రెండూ మహిమాన్వితమైనవని ఇక్కడి స్థలపురాణం చెబుతూ వుంటుంది.
ఇందులోని ఒక సరస్సులోకి స్నానం కోసమని దిగిన నారద మహర్షి ... తన రూపాన్ని కోల్పోయి స్త్రీ రూపాన్ని పొందాడు. దీనిని 'నారద సరస్సు' అని పిలుస్తింటారు. శ్రీమన్నారాయణుడి సంకల్పం కారణంగా ఆ సరస్సు ఏర్పడిందనీ, విష్ణు మాయను తనకి తెలియజేయడానికే ఆయన అలా చేశాడని నారద మహర్షి భావిస్తాడు. ఆయన ప్రార్ధన మేరకు విష్ణుమూర్తి సాక్షాత్కరించి .. ఆ పక్కనే ఉన్న సరస్సులో స్నానం చేయమని చెబుతాడు.
అందులోకి దిగిన నారమహర్షికి ... స్త్రీ రూపం నుంచి విముక్తి కలుగుతుంది. అందువలన ఈ సరస్సుని 'ముక్తికా సరస్సు' అని పిలుస్తుంటారు. నారద మహర్షి అంతటి వాడికి విముక్తిని కలిగించింది కనుక ఈ సరస్సు మహిమాన్వితమైనదని చెబుతుంటారు. ఈ క్షేత్రానికి చేరుకున్న భక్తులు ముందుగా ఈ సరస్సులను దర్శించి, ముక్తికా సరస్సులోని నీళ్లు తలపై చల్లుకుని భావనారాయణస్వామి దర్శనం చేసుకుంటూ వుంటారు. ఈ విధంగా చేయడం వలన సమస్త పాపాల నుంచి ... దోషాల నుంచి విముక్తి కలుగుతుందని అంటారు.