రాగి లోహంతో చేసిన గణపతిని పూజిస్తే ?
ఆధ్యాత్మిక ప్రపంచంలో వినాయకుడికి ప్రత్యేక స్థానం వుంది. ప్రాచీనకాలం నుంచి వినాయకుడికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వబడింది. సాధారణ మానవుల నుంచి మహర్షులు ... దేవతల వరకూ వినాయకుడిని ఆరాధించకుండా ఏ పనిని ఆరంభించరు. ప్రతి దేవతా ఆరాధనలోను ప్రధమ పూజను అందుకునే వినాయకుడు వివిధ ముద్రలతో ... నామాలతో దర్శనమిస్తూ వుంటాడు.
ప్రతి ఒక్కరూ తమకి సంబంధించిన ఏ పనిలోనూ ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఉండాలని వినాయకుడిని కోరుకుంటూ వుంటారు గనుక ఆయన ఆలయాలు ఎప్పుడు చూసినా ఎంతో సందడిగా కనిపిస్తుంటాయి. ఇక ఇంట్లోను పూజా మందిరాల్లో వివిధ ముద్రలలో గల గణపతి ప్రతిమలను ఏర్పాటు చేసుకుని అనునిత్యం ఆరాధించే వాళ్ల సంఖ్య ఎక్కువగానే వుంటుంది.
ఈ నేపథ్యంలో మట్టితో ... రాయితో ... లోహంతో చేయబడిన వినాయక విగ్రహాలను పూజిస్తూ వుంటారు. సాధారణంగా వినాయకుడిని పూజిస్తే కార్యసిద్ధి కలుగుతుందనే విషయం అందరికీ తెలిసిందే. అలాగే కొన్ని వినాయక మూర్తులను పూజించడం వలన గ్రహ సంబంధమైన దోషాలు కూడా తొలగిపోతాయని చెప్పబడుతోంది. ఈ నేపథ్యంలో 'కుజ' గ్రహ సంబంధమైన దోషాలతో ఇబ్బందులు పడుతున్న వాళ్లు 'రాగి'తో చేయబడిన గణపతిని ఆరాధించాలని చెప్పబడుతోంది.
కుజ గ్రహ దోషాలు అనేక సమస్యలు సృష్టిస్తూ మానసిక ప్రశాంతత అనేది లేకుండా చేస్తుంటాయి. అందువలన ఆయనని శాంతింపజేయాలనుకునే వాళ్లు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటి వాళ్లు రాగి లోహంతో చేయబడిన గణపతిని పూజించడం వలన ఆశించిన ఫలితం లభిస్తుందట.