దేవుడు ఎవరిని కాపాడుతూ వుంటాడు ?
ధర్మాన్ని ఎవరు ఆశ్రయిస్తారో ... ధర్మాన్ని ఎవరు అనుసరిస్తూ ఉంటారో వాళ్లని దేవుడు కాపాడుతూ వుంటాడు. అందుకు ఎన్నో నిదర్శనాలు కనిపిస్తూ వుంటాయి. విష్ణుభక్తుడైన అంబరీషుడి జీవితం కూడా ఇందుకు ఓ ఉదాహరణంగా కనిపిస్తూ వుంటుంది.
అంబరీషుడు రాజకుటుంబానికి చెందినవాడే అయినా ఎప్పుడూ విందువినోదాల గురించి ఆలోచించేవాడు కాదు. భగవంతుడిని ఆరాధించడం ... నిస్సహాయులను ఆదరించడం ... ధర్మాన్ని అనుసరించడం మాత్రమే ఆయనకి తెలుసు. అలాంటి అంబరీషుడిని ఆయన సోదరుడైన చిత్రసేనుడు రాజ్యకాంక్షతో అడవులకి పంపిస్తాడు. అధికారులు గానీ ... ప్రజలు గాని అంబరీషుడిని కలుసుకోకుండా నిఘా ఏర్పాటు చేస్తాడు.
అయితే రాజ భవనాలలో అనుభవించిన ఆనందానికన్నా ... ఆశ్రమవాసంలో భగవంతుడి సేవలో ఎక్కువ ఆనందాన్ని పొందుతాడు అంబరీషుడు. ఆ అడవిలో ఆ శ్రీమన్నారాయణుడు ఆయనను అడుగడుగునా కాపాడుతూ వుంటాడు. ధర్మాత్ముడైన ఆయన ఆ రాజ్యాన్ని వదిలివేసిన కారణంగా అక్కడ వానలు కురవక పోవడం ... పంటలు పండకపోవడం జరుగుతుంది.
కరవుకాటకాలు గ్రామాలను కబళిస్తూ అంతఃపురానికి సమీపంగా వస్తూ వుంటాయి. అధర్మ మార్గాన్ని ఎంచుకుని రాజ్య ప్రజలను కష్టాలపాలు చేసిన చిత్రసేనుడిని ఎదిరించడానికి ప్రజలు సిద్ధమవుతారు. పరిస్థితిని గ్రహించిన చిత్రసేనుడు .. అంబరీషుడి దగ్గరికి వెళ్లి తన తప్పుని మన్నించమని ప్రాధేయపడి రాజ్యానికి తీసుకువస్తాడు. అంబరీషుడు ఆ రాజ్యంలోకి అడుగుపెట్టగానే హోరున వర్షం కురుస్తుంది. క్రమంగా కరవుకాటకాలు కనుమరుగై ప్రకృతి పచ్చదనాన్ని సంతరించుకుంటుంది. ప్రజలంతా సుఖసంతోషాలతో కూడిన జీవనాన్ని కొనసాగిస్తూ వుంటారు.