ఏకాగ్రతే దేవుడి సమీపానికి చేర్చగలదు
భగవంతుడు కరుణా సముద్రుడు ... కస్టాలు తీర్చేస్తాడు ... కన్నీళ్లు తుడిచేస్తాడు. అంకిత భావంతో ఆరాధిస్తే ఆవేదనలు దూరం చేస్తాడు. అలాంటి భగవంతుడిని అనునిత్యం పూజించే వాళ్లు చాలామంది వుంటారు. ఉదయాన్నే స్నానం చేసి ... పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి ... మందిరాన్ని వివిధ రకాల పుష్పాలతో అలంకరిస్తారు. నైవేద్యానికి పండ్లు ... పాయసం వంటివి సిద్ధం చేస్తారు.
అయితే కాసేపు అలా భగవంతుడి నామాన్ని స్మరిస్తూ కళ్లు మూసుకుంటే, మనసు ఎటోవైపు పరుగులు తీస్తుంది. అనవసరమైన ఆలోచనలన్నీ ఆ సమయంలో గుర్తుకువస్తుంటాయి. భగవంతుడిపై దృష్టిని నిలపాలని అనిపిస్తూ వుంటుంది. అందుకు మనసును సిద్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ విఫలమై పోవడం జరుగుతూ వుంటుంది. ఏకాగ్రత కుదరకపోవడంతో అసహనానికి లోనవుతూ పూజ అయిందని పిస్తుంటారు.
ఈ విషయాన్ని గురించి ప్రస్తావిస్తూ రామకృష్ణ పరమహంస ఒక సంఘటనను గురించి చెబుతుండేవారట. భగవంతుడి పాదాలపై మనసు నివడం లేదని భావించిన ఓ సాధువు, గురువు యొక్క అనుగ్రహంతో దానిని సాధించాలని అనుకుంటాడు. గురువును వెతుక్కుంటూ బయలుదేరిన ఆయనకి ఒకచోట ఒక బోయవాడు కనిపిస్తాడు. ఒకవైపు నుంచి మేళతాళాలతో పెళ్లి బ్రందం పక్కనుంచే వెళుతున్నా పట్టించుకోకుండా, ఆ బోయవాడు చెట్టుకొమ్మపై వాలిన పక్షిని గురిచూస్తూ బాణంతో కొడతాడు. అతని ఏకాగ్రత చూసి ఆ సాధువు ఆశ్చర్యపోతాడు.
తన చుట్టుపక్కల ఏం జరుగుతుందో పట్టించుకోకుండా ఆ బోయవాడు ఆ పక్షి పైనే తన దృష్టిని నిలిపాడు. అలా ఏకాగ్రతతో భగవంతుడిపై మనసును లగ్నం చేయాలని అర్థం చేసుకుంటాడు. ఈ విషయాన్ని తనకి తెలియజెప్పిన ఆ బోయవాడే తనకి గురువుగా భావించి వినయంగా నమస్కరిస్తాడు. మనసు కోతిలాంటిది ... అది చిత్ర విచిత్రమైన వేషాలు వేస్తూ వుంటుంది. ఎటు తోస్తే అటు పరిగెడుతూ వుంటుంది. సాధన ద్వారా అలాంటి మనసును అదుపులోకి తెచ్చుకుని ఏకాగ్రతను సాధించాలి. అప్పుడే భక్తుడిగా భగవంతుడి సన్నిధిలోకి అడుగుపెట్టగలుగుతాము. ఆయన సమీపంలో అనిర్వచనీయమైన అనుభూతిని పొందగలుగుతాము.