అంతా భగవంతుడి లీలావిశేషమే !

శ్రీరాముడు మహా పరాక్రమవంతుడు ... ఆయన మాట ... బాణం రెండూ వృథాకావు అనే విషయం రావణుడికి తెలుసు. ఇక సీతాదేవి వున్న వైపుకి తుమ్మెదను కూడా వెళ్లనీయని లక్ష్మణుడు వుండగా ఆమె వైపు చూడటం కూడా కష్టమే. అందుకే వాళ్లిద్దరూ లేని సమయంలో సీతను అపహరించాలని రావణుడు అనుకున్నాడు.

మారీచుడిని రప్పించి ... బంగారు వర్ణంలో గల లేడిగా సీతకు కనిపించి అక్కడి నుంచి పరుగు తీయమని చెబుతాడు. ఆ లేడిని చూసిన సేత ముచ్చట పడుతుందనీ, ఆమె కోరిక మేరకు రాముడు దానిని తీసుకురావడానికి వెళతాడని అంటాడు. రాముడి స్వరంతో మారీచుడు అరవడంతో ... లక్ష్మణుడు కూడా ఆ వైపు వస్తాడనీ, అప్పుడు ఒంటరిగా వున్న సీతను తాను అపహరించడానికి మార్గం తేలిక అవుతుందని చెబుతాడు.

మారీచుడు అక్షరాలా రావణుడి మాట పాటిస్తాడు. మహానుభావులు ఇక్కడే ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. బంగారులేడిని చూసి అది కావాలనీ సీత అడగపోయినా .. రాముడు ఆ లేడి కోసం వెళ్లకపోయినా .. లక్ష్మణుడు ఆమెను విడిచి అక్కడి నుంచి కదలకపోయినా రావణుడి పథకం విఫలమై వుండేదట. కానీ పొల్లు పోకుండా రావణుడు ఏదైతే మారీచుడికి చెప్పాడో .. అదే జరిగింది.

అలా జరగడం రావణుడి గొప్పతనం కాదనీ ... ఆ శ్రీమన్నారాయణుడి లీలావిశేషమేననేది పెద్దలమాట. రావణుడి ఆటకట్టించడం కోసం ఆయనతో అలా పలికించిందీ ... ఆ పథకం అమలుజరిగేలా చేసింది కూడా శ్రీమన్నారాయాణుడేనని అంటారు. ఇప్పుడు రావణుడు పరస్త్రీని అపహరించి అధర్మానికి పాల్పడ్డాడు. పాపం చేసినవాడిగా లోకుల ముందు దోషిగా నిలబడ్డాడు. దీనిని కారణంగా చూపిస్తూ రావణుడిని రాముడు సంహరించాడని అంటారు. లోక కల్యాణం కోసం ఆ శ్రీమన్నారాయణుడు చేసిన లీలావిశేషాల్లో ఇది ఒకటిగా చెబుతుంటారు.


More Bhakti News