ఇక్కడి ఆంజనేయుడు ఇలా ప్రసిద్ధిచెందాడట !

హనుమంతుడిని ఆరాధించడం వలన బుద్ధి వికసిస్తుందనీ ... ఆరోగ్యం కలుగుతుందనీ ... కీర్తి పెరుగుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. హనుమంతుడిని పూజించడం వలన గ్రహ సంబంధమైన దోషాలు కూడా తొలగిపోతాయని అంటారు. అలాంటి హనుమంతుడు కొలువుదీరిన ఒక క్షేత్రంలో ఆయనని దర్శించుకుంటే శారీరక లోపాలు తొలగిపోతాయని చెప్పుకుంటూ వుంటారు.

ఆ క్షేత్రమే 'బొగ్గరం' ... ఇది గుంటూరు జిల్లా నకిరేకల్ మండల పరిధిలో దర్శనమిస్తూ వుంటుంది. ఇక్కడి హనుమంతుడు శారీరక లోపాలను తొలగిస్తాడనే విశ్వాసం కలగడానికి కారణం లేకపోలేదు. చాలాకాలం క్రిందట ఇక్కడికి సమీప గ్రామం నుంచి భార్యాభర్తలు వచ్చారట. పేదరికంతో బాధపడుతోన్న తమని సంతానలేమి కూడా వేధిస్తోందనీ, వృద్ధాప్యంలో తమని కనిపెట్టుకుని ఉండటానికి పుత్ర సంతానం ఇవ్వమని అడిగారు.

స్వామి అనుగ్రహంతో వారికి ఒక మగబిడ్డ కలిగాడు. బిడ్డ ఎదుగుతూ ఉండటం ... నడవడానికి ప్రయత్నించకపోవడం ఆ దంపతులను కలవరపరించింది. బిడ్డ కాళ్లలో సత్తువలేదని తెలిసి కన్నీళ్లపర్యంతమయ్యారు. ఆ బిడ్డను వెంటబెట్టుకుని ఈ ఆలయానికి వచ్చి, అలాంటి బిడ్డను జీవితాంతం తాము పోషించలేమంటూ ఆ బిడ్డను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు.

ఆ మరునాడు ఆ బిడ్డ తమని వెతుక్కుంటూ నడచిరావడం చూసిన తల్లిదండ్రులు సంతోషంతో పొంగిపోయారు. ఈ విషయం ఆనోటా ఈ నోట అందరికీ తెలిసిపోయింది. స్వామివారు శారీరక లోపాలను తొలగిస్తాడనే విశ్వాసానికి ఈ సంఘటన నిదర్శనంగా నిలిచిందని చెబుతుంటారు. మనసున్న దేవుడు ... మహిమగలిగిన దేవుడు అంటూ అంకితభావంతో ఆరాధిస్తూ వుంటారు.


More Bhakti News