ఆవుకి అన్నం పెడితే కలిగే ఫలితం !
ప్రాచీనకాలం నుంచి గోవుని సకలదేవతా స్వరూపంగా భావించి పూజించడం జరుగుతోంది. ఈ కారణంగానే గోవుని పూజించడం వలన అందరి దేవతల అనుగ్రహం లభిస్తుందని చెబుతుంటారు. గోవుకి ఒకసారి ప్రదక్షిణ చేయడం వలన, భూమండలానికి ప్రదక్షిణ చేసిన ఫలితం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
ఈ భూమండలంపై ఎన్నో పుణ్యక్షేత్రాలు ... పుణ్యతీర్థాలు వున్నాయి. వాటన్నింటికీ ప్రదక్షిన చేసిన ఫలితం ... గోవుకి ప్రదక్షిణ చేయడం వలన కలుగుతుంది. అలాంటి గోమాతకు అన్నం పెట్టడం వలన 'సంతాన భాగ్యం' కలుగుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. గోవు సాధుజీవి ... దానికి ఉపకారం చేయడమే తప్ప అపకారం చేయడం తెలియదు.
పసిపాప ఆకలి తీర్చడం నుంచి పరమశివుడికి అభిషేకం చేయడం వరకూ గోవుపాలు శ్రేష్ఠమైనవిగా ... విశిష్టమైనవిగా చెప్పబడుతున్నాయి. అలాంటి గోవుకి అన్నంపెట్టే అవకాశం కలగడమే గొప్ప విషయంగా భావించాలి. వివాహమైన తరువాత ఏ జంట అయినా తమకి కలగనున్న సంతానం గురించే కలలు కంటారు. సంతానం కలిగే విషయంలో ఏ మాత్రం ఆలస్యం జరిగినా కలతచెందుతారు.
భగవంతుడి అనుగ్రహాన్ని ఆశిస్తూ అనేక పూజలు ... వ్రతాలు చేస్తుంటారు. తమ కోరికను నెరవేర్చమంటూ గుళ్లూ గోపురాలు తిరుగుతుంటారు. ఇలా సంతానం కోసం తపించేవాళ్లు ... ప్రతి రోజు తాము భోజనం చేసే సమయంలో కొంత భాగాన్ని గోవుకి పెట్టాలని చెప్పబడుతోంది. ఈ విధంగా చేయడం వలన వాళ్ల కోరిక అనతికాలంలోనే తీరుతుందని స్పష్టం చేయబడుతోంది.