మహిమగల మారుతీ క్షేత్రం
భగవంతుడిని ప్రత్యక్షంగా సేవించిన హనుమంతుడు అద్వితీయమైన స్థాయిలో ఆయన మనసు గెలుచుకున్నాడు. అదే స్థాయిలో భక్తుల ఆపదలను గట్టెక్కించి వాళ్ల హృదయాలను కూడా ఆకట్టుకున్నాడు. ఈ కారణంగానే ఆయన భక్తాంజనేయుడుగా .. యోగాంజనేయుడుగా ... వీరాంజనేయుడుగా ... ధ్యానాంజనేయుడుగా ... దాసాంజనేయుడుగా పూజాభిషేకాలు అందుకుంటున్నాడు.
ఆయన ఏ భంగిమలో కొలువైనా ... ఏ నామంతో పిలవబడుతున్నా భక్తులు కొంగుబంగారంగా భావిస్తూ కొలుస్తుంటారు. అలా అశేష భక్తజనులచే నిత్యనీరాజనాలు అందుకుంటోన్న హనుమంతుడి ఆలయాలలో ఒకటి గుంటూరు జిల్లా నకిరేకల్ మండలం 'బొగ్గరం' గ్రామంలో కనిపిస్తుంది. భారీ రూపాన్ని సంతరించుకున్న ఇక్కడి ప్రసన్నాంజనేయుడు మహిమల గల వాడిగా చెబుతుంటారు. సాధారణంగా హనుమంతుడి క్షేత్రాలను దర్శించడం వలన గ్రహ సంబంధమైన దోషాలు ... దుష్ట ప్రయోగాలు వలన కలిగే ఇబ్బందులు తొలగిపోతాయని చెబుతుంటారు.
ఇక ఇక్కడి హనుమంతుడిని పూజించడం వలన మానసిక ... శారీరక లోపాలతో ఇబ్బందులు పడుతున్నవారికి మంచిఫలితం కనిపిస్తుందని చెప్పబడుతోంది. ఈ విషయంలో సందేహాలు వున్నవారికి ఇక్కడ మొక్కులు చెల్లించుకునే వాళ్లు నిదర్శనంగా కనిపిస్తూ వుంటారు. మహిమగల మారుతీ క్షేత్రంగా పిలవబడుతోన్న ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.