ఈ ఆలయ దర్శనం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది
ధర్మమార్గాన్ని ఎలా అనుసరించాలనేది శ్రీరాముడు ఈ లోకానికి ఆచరించి చూపించాడు. పతిసేవయే పరమార్థంగా ఎలా నడచుకోవాలనేది సీతమ్మ చాటిచెప్పింది. కష్టసుఖాల్లోను కలిసి నడచిన అన్యోన్య దాంపత్యం వారిది. ఆదర్శవంతమైన దంపతులు అనగానే సీతారాముల రూపమే అందరి కనులముందు కదలాడుతుంది. అందుకే సీతారాములు అనే పేరును విడదీసి పలకడానికి కూడా చాలామంది ఇష్టపడరు.
అలాంటి సీతారాముల ఆలయాలు అనేక ప్రాంతాల్లో కొలువుదీరి కనిపిస్తూ వుంటాయి. సాధారణంగా రామాలయం అనగానే అందులో సీతారాములతో పాటు, లక్ష్మణుడు .. హనుమంతుడు కూడా కనిపిస్తుంటారు. గర్భాలయంలో వీళ్ల నలుగురులో ఎవరు కనిపించకపోయినా ఆశ్చర్యంగా అనిపిస్తూ వుంటుంది. అలాంటి ఆశ్చర్యానికి గురిచేసే రామాలయం మనకి 'బేతవోలు' గ్రామంలో కనిపిస్తుంది.
నల్గొండ జిల్లా చిలుకూరు మండలంలో ఈ క్షేత్రం కనిపిస్తుంది. క్రీ.శ. 1205వ సంవత్సరంలో ఇక్కడ సీతారాములను ప్రతిష్ఠించినట్టు శాసనాలు చెబుతున్నాయి. అప్పట్లో ఈ ప్రాతం బేతాళ రెడ్డిరాజుల ఏలుబడిలో ఉండేదట. అందుకే ఈ గ్రామానికి బేతవోలు అనే పేరు వచ్చినట్టుగా చెబుతుంటారు. ఇక్కడి ఆలయంలో సీతారాములు మాత్రమే కనిపిస్తుంటారు. లక్ష్మణుడినీ ... హనుమంతుడిని ప్రతిష్ఠించక పోవడం గురించి రకరకాల కథనాలు వినిపిస్తుంటాయి.
వాళ్ల పాలనా కాలంలో సీతారాముల కళ్యానోత్సవం తొమ్మిదిరోజుల పాటు ఘనంగా నిర్వహించేవారు. ఇప్పుడు శ్రీరామనవమి సందర్భంగా బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుపుతుంటారు. చుట్టుపక్కల గ్రామాలలోని ప్రజలు సైతం ఇక్కడి సీతాముల పట్ల ఎంతో ప్రేమానురాగాలను వ్యక్తం చేస్తుంటారు. వాళ్లంతా కల్యాణానికి తరలివచ్చి సందడి చేస్తుంటారు. ఇక్కడి సీతారాముల ఆశీస్సులు అందుకోవడం వలన సంతాన సౌభాగ్యాలు కలకాలం నిలుస్తాయనీ, సకల శుభాలు చేకూరతాయని భక్తులు విశ్వసిస్తుంటారు.