ఆపదలో ఈ స్వామిని స్మరిస్తే చాలట !

శ్రీమన్నారాయణుడు ... చెన్నకేశవస్వామి పేరుతో అనేక ప్రాంతాల్లో ఆవిర్భవించాడు. అలా ఆయన ఆవిర్భవించిన క్షేత్రాల్లో చాలావరకూ ప్రాచీనమైనవే కనిపిస్తూ వుంటాయి. ప్రాచీన కాలంలో చెన్నకేశవస్వామిని ఆపదలో ఆదుకునే దైవంగా ... వీరత్వాన్నీ ... విజయాన్ని ప్రసాదించే దైవంగా రాజులు విశ్వసిస్తూ వచ్చారు. ఇష్ట దైవంగా ... ఇలవేల్పుగా భావిస్తూ ఆరాధించారు.

ఈ నేపథ్యంలోనే ఆయా ప్రాంతాల్లో చెన్నకేశవస్వామి ఆలయాలు దర్శనమిస్తూ వుంటాయి. అలాంటి విశిష్టమైన క్షేత్రాల్లో ఒకటి మనకి 'చిలుకూరు' లో కనిపిస్తుంది. నల్గొండ జిల్లాలో గల ఈ క్షేత్రం భక్తులపాలిట కొంగుబంగారమై విలసిల్లుతోంది. సువిశాలమైన ప్రదేశంలో నిర్మించబడిన ఈ ఆలయంలో స్వామివారు శ్రీదేవి - భూదేవి సమేతుడై దర్శనమిస్తూ వుంటాడు.

కాకతీయుల కాలంలో నిర్మించబడిన చెన్నకేశవస్వామి ఆలయాలలో ఇది ఒకటిగా చెబుతుంటారు. ఆలయ ప్రాంగణంలో కాకతీయులు వేయించిన శాసనం కూడా కనిపిస్తూ వుంటుంది. కాకతీయుల పాలనా కాలంలో వైభవంగా వెలుగొందిన ఈ ఆలయం, నేటికీ భక్తుల సందడితో కళకళలాడుతూ కనిపిస్తూ వుంటుంది. ఈ క్షేత్రంలో స్వామి మహిమలుగా అనేక సంఘటనలకి సంబంధించిన విషయాలు వినిపిస్తూ వుంటాయి. ఆపదలో ఆయన్ని స్మరిస్తే చాలట!

స్వామి అనుగ్రహం కారణంగా ఆపదల నుంచి ... అనారోగ్యాల నుంచి బయటపడిన వాళ్లు ఎంతోమంది వున్నారని చెబుతుంటారు. సంపదలను ... సంతాన సౌభాగ్యాలను స్వామి ప్రసాదిస్తూ ఉంటాడని అంటారు. ప్రతి సంవత్సరం 'వైశాఖ పౌర్ణమి' సందర్భంగా స్వామివారికి కల్యాణోత్సవం నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా భక్తులంతా పెద్దసంఖ్యలో ఈ ఉత్సవానికి తరలివస్తుంటారు. స్వామివారికి సంబంధించిన వివిధ సేవల్లో పాల్గొంటూ తరిస్తుంటారు.


More Bhakti News