విష్ణులోక ప్రాప్తిని కలిగించే దానం !
వివిధ మాసాల్లో .. ఆయా పుణ్యతిథుల్లో చేసే జప .. తప .. స్నాన .. దానాల వలన అనంతమైన ఫలితాలు కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో చాంద్రమానం ప్రకారం ఆరవ నెలగా చెప్పబడుతోన్న భాద్రపద మాసం కూడా తనదైన ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తూ వుంటుంది.
ఇటు దేవతలను ... అటు పితృదేవతలను కూడా పూజించుకుని విశేష ఫలితాలను పొందే అవకాశాన్ని ఈ మాసం కల్పిస్తూ వుంటుంది. కార్యసిద్ధిని కలిగించి సకల శుభాలను ప్రసాదించే వినాయకుడికి ఈ మాసంలోనే ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుంది. లోక కల్యాణం కోసం శ్రీమహావిష్ణువు ధరించిన దశావతారాలను పూజిస్తూ వ్రతాన్ని ఆచరించడం ఈ మాసంలో కనిపిస్తుంది.
అలాగే ఉమామహేశ్వర వ్రతాన్ని ఆచరించడం వలన పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులను అందుకోవడం జరుగుతుంది. ఇలాంటి విశేషాలను సంతరించుకున్న భాద్రపద మాసంలో ఏ రోజున ఏ దానం చేయడం వలన విశేష ఫలితం లభిస్తుందోననే సందేహం కొంతమందికి కలుగుతుంటుంది. ఈ మాసంలో 'పౌర్ణమి' రోజున 'భాగవత పురాణం' దానం చేయాలని శాస్త్రం చెబుతోంది.
కలియుగంలో దేనిని చదవడం వలన విశేషమైన పుణ్య ఫలితాలు లభిస్తాయో చెప్పవలసిందిగా మహర్షులంతా కలిసి 'సూతుడు'ని కోరారట. 'భాగవతం పురాణం' చదవడం వలన అనంతమైన ఫలితాలు దక్కుతాయనీ ... ఫలితంగా జన్మ ధన్యమవుతుందని ఆయన చెప్పాడట. అంతటి స్థానాన్ని కలిగి ఉన్నటువంటి భాగవత పురాణమును బాద్రపద మాసంలోని పౌర్ణమి రోజున దానం చేయడం వలన, శరీరాన్ని విడిచిన తరువాత విష్ణులోక దర్శన భాగ్యం కలుగుతుందని చెప్పబడుతోంది.