మంగళచండీ ఆరాధనా ఫలితం

ఆదిపరాశక్తి అయిన అమ్మవారి రూపాలలో ఒకటిగా ... నామాలలో ఒకటిగా 'మంగళ చండి' దర్శనమిస్తూ వుంటుంది. ఎలాంటి ఆపద కలిగినా అమ్మా అని ఆర్తితో పిలవగానే ఆ తల్లి ఆప్యాయంగా అక్కున చేర్చుకుంటుంది. తన పట్ల ప్రేమానురాగాలు కలిగిన బిడ్డలు అధర్మ మార్గం దిశగా అడుగులు వేయకుండా ఆ తల్లి కంటికి రెప్పలా కాపాడుతూ వుంటుంది. ధర్మబద్ధమైన మార్గంలో వాళ్లని ముందుకి నడిపిస్తూ తన సహాయ సహకారాలను అందిస్తూ వుంటుంది.

మంగళవారం రోజున ఉపవాస దీక్షను చేపట్టి ఆ తల్లిని పూజిస్తేచాలు మరింత ప్రసన్నురాలై, కోరిన వరాలను ప్రసాదిస్తుంది. తన పట్ల భక్తి విశ్వాసాలను ప్రదర్శించినవారి సౌభాగ్యాన్ని కలకాలం కాపాడుతూ వుంటుంది. సంతాన భాగ్యాన్ని కలిగించి సంతోషాలను అందిస్తుంది. తన ఆశీస్సులు అందుకుని ఆరభించిన పనులకు ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా చూస్తుంది. తన పూజ అనంతరం ఎవరు ఎలాంటి కార్యాన్ని తలపెట్టినా విజయాన్ని చేకూర్చుతుంది.

ఇక ఈ అమ్మవారిని పూజించడం వలన కుజ దోషం కూడా తొలగిపోతుందని అంటారు. కుజుడు ... అమ్మవారిని ఆరాధిస్తూ వుంటాడు. అమ్మవారి భక్తుల విషయంలో ఆయన కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తూ వుంటాడు. అమ్మవారి కరుణకు నోచుకున్న భక్తులపై తన ప్రభావాన్ని తగ్గిస్తూ వెళతాడు. అందువలన కుజ సంబంధమైన దోషంతో ఇబ్బందులు పడుతున్న వాళ్లు మంగళ చండీని ఆరాధించడం వలన ఆశించిన ప్రయోజనం కనిపిస్తుందని స్పష్టం చేయబడుతోంది.


More Bhakti News