ఇక్కడి శివుడిని ఇలా పిలుస్తారు !
భూలోకంలో ఆదిదేవుడు లింగాకారంలో పూజాభిషేకాలు అందుకుంటూ వుంటాడు. ఆయన ఆవిర్భవించిన తీరును బట్టి ... అందుకు దారితీసిన పరిస్థితులను బట్టి ... స్థల మహాత్మ్యాన్ని బట్టి వివిధ నామాలతో పిలవబడుతూ వుంటాడు. రామలింగేశ్వరుడు ... అగస్త్యేశ్వరుడు ... సోమేశ్వరుడు ... ఇలా అనేక నామాలతో ఆరాధించబడుతూ ఉంటాడు.
ఈ నేపథ్యంలో వినిపించే మరో పేరే 'కేతకీ సంగమేశ్వరుడు'. పౌరాణిక నేపథ్యాన్ని కలిగిన ఈ క్షేత్రం మెదక్ జిల్లా 'ఝరాసంగం'లో అలరారుతోంది. ఇది తీర్థ సంగమ స్థానం కావడం వలన శివుడికి సంగమేశ్వరుడు అనే పేరు వచ్చిందనీ, కేతకీ వనంలో ఆవిర్భవించిన కారణంగా కేతకీ సంగమేశ్వరుడుగా పిలుచుకుంటూ ఉంటారని స్థలపురాణం చెబుతోంది.
అయితే కేతకీ వనంలోనే ఆయన ఎందుకు ఆవిర్భవించాడనే సదేహం కొంతమందికి కలుగుతూ వుంటుంది. కేతకీ వనం అంటే ... మొగలి పూల వనం. బ్రహ్మ దేవుడి తరఫున అబద్ధపు సాక్ష్యం చెప్పిన కేతకి ... భూలోకంలో కేతకీ వనంగా మారిపోవలసిందిగా శివుడి శాపానికి గురవుతుంది. ఆమె తనని మన్నించమంటూ ప్రాధేయ పడటంతో, కేతకీ వనంలో తాను ఆవిర్భవించి ఆ పూలతో తాను పూజించబడిన రోజున ఆమెకి మోక్షం లభిస్తుందని చెబుతాడు.
అలా కేతకీ ఇక్కడ వనరూపంలో వుండగా, ఇక్కడ శివుడిని గురించి బ్రహ్మదేవుడు తపస్సు చేయగా ఆయన అభ్యర్థన మేరకు ఆవిర్భవిస్తాడు. కేతకీ పుష్పాలతో పూజలు అందుకుంటూ భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఈ కారణంగానే ఇక్కడి శివుడిని 'కేతకీ సంగమేశ్వరుడు' గా భక్తులు పిలుచుకుంటూ ... కొలుచుకుంటూ వుంటారు.