అలా నాగేంద్రుడు ఇక్కడికి వచ్చాడు
శివకేశవుల అనుగ్రహాన్ని పొందిన నాగేంద్రుడు ... మానవాళిచే దైవంగా భావించబడుతున్నాడు. కొన్ని శైవ క్షేత్రాల్లోను ... మరి కొన్ని వైష్ణవ క్షేత్రాల్లోను ఆవిర్భవించి పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. కొన్ని ప్రాంతాల్లో నాగేంద్రుడు ఉపాలయంగా కాకుండా ప్రధాన దైవంగా కూడా కనిపిస్తుంటాడు.
అలా నాగేంద్రుడు ప్రధాన దైవంగా కొలువై పూజలు అందుకుంటోన్న క్షేత్రాలు మరింత విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంటాయి. అలాంటి ఆలయాల జాబితాలో ఒకటి నల్గొండ జిల్లా కోదాడ సమీపంలో దర్శనమిస్తుంది. కోదాడ నుంచి ఖమ్మం వెళ్లే మార్గంలో కుడివైపున ఈ ఆలయం కనిపిస్తుంది. నాగేంద్రస్వామి ఇక్కడ ఆవిర్భవించిన తీరు ... ఒక్కొక్కటిగా తన మహిమలను ఆవిష్కరిస్తూ వచ్చి ప్రసిద్ధి చెందిన తీరు ఆసక్తికరంగా వుంటుంది.
చాలాకాలం క్రిందట ఈ ప్రదేశంలో పెద్ద పాముపుట్ట వుండేది. అంతపెద్దగా పాము పుట్ట పెరగడం అక్కడివారికి ఆనందాశ్చర్యాలని కలిగిస్తుంది. నాగ సంబంధమైన పర్వదినాల్లో భక్తులు ఇక్కడి పుట్టలో పాలు పోస్తూ వుండే వాళ్లు. అలా కొంతకాలం గడిచిన తరువాత, ఇక్కడ తాను ఆవిర్భవించినట్టుగా నాగేంద్రుడు ఒక వ్యక్తి వంటి పైకి వచ్చి చెప్పడంతో ఈ పుట్ట దైవ సంబంధితమైనదిగా వెలుగులోకి వచ్చింది.
ఆ వ్యక్తి సంకల్ప బలంతో ... భక్తుల సహాయ సహకారాలతో ఇక్కడ ఆలయం నిర్మించబడింది. ఈ లోగా ఇక్కడి నాగేంద్రుడిని నమ్ముకున్న వారికి శుభాలు జరగడంతో, ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఇక్కడి స్వామిని దర్శించడం వలన సంతాన సౌభాగ్యాలు రక్షించ బడతాయని చెబుతుంటారు.
స్వామి అనుగ్రహంతో కోరికలు నెరవేరిన వాళ్లు ఇక్కడికి వచ్చి అనుకున్న విధంగా మొక్కులు చెల్లిస్తుంటారు. ప్రతి మంగళవారం రోజున ఇక్కడికి వచ్చే మహిళా భక్తుల సంఖ్య ఎక్కువగా వుంటుంది. స్వామివారి దర్శనం చేసుకుని .. తమ మనసులోని మాటను చెప్పుకుని .. ఆయన అనుగ్రహాన్ని ఆశిస్తూ ... ఆశీస్సులు అందుకుని వెళుతుంటారు.