పెద్దకోనేరు ప్రత్యేకత ఇదే !

శ్రీదేవి .. భూదేవి సమేతంగా చెన్నకేశవస్వామి ఆవిర్భవించిన ప్రాచీన క్షేత్రాలలో 'కోగిలవాయి' ముందువరుసలో కనిపిస్తుంది. వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం పరిధిలో ఈ క్షేత్రం అలరారుతోంది. గుట్టపై భాగంలో పుచ్చకాయలా నాలుగు ముక్కలుగా పగిలిపోయిన ఓ బండకింద స్వామివారి వెలిశాడు.

పౌరాణిక నేపథ్యం కలిగిన క్షేత్రం కావడం వలన ఎంతోమంది రాజులు ఈ క్షేత్ర అభివృద్ధికి తమవంతు కృషి చేశారు . పూర్వం ఈ క్షేత్రం పరిధిలో ఏడు కోనేర్లు ఉండేవని చెబుతుంటారు. వాటిలో పెద్ద కోనేరుగా చెప్పబడుతోన్నది ఆలయం ప్రాంగణంలో కనిపిస్తూ వుంటుంది.

'గజేంద్ర మోక్షం' ఇక్కడే జరిగిందని శాసనం చెబుతూ వుంటుంది. గజేంద్రుడిని రక్షించడానికి వచ్చిన స్వామి ఆ తరువాత ఇక్కడ వెలిశాడనేది స్థలపురాణం. అంతటి విశిష్టతను సంతరించుకున్న ఈ కోనేటిని స్థానికులు ఎంతో అపురూపంగా చూసుకుంటూ వుంటారు. ఈ కోనేరును చూడగానే ఇది మహిమాన్వితమైనదనే విషయం తెలిసిపోతూ ఉంటుందని అంటారు.

ఈ కోనేటి తీర్థాన్ని సేవించడానికి సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. ఎందుకంటే ఇందులోని నీటిని తీర్థంగా స్వీకరించడం వలన చర్మవ్యాధులు నివారించబడతాయనీ, సంతాన యోగం కలుగుతుందని చెబుతుంటారు. కాకతీయుల కాలంలో వైభవంతో వెలుగొందిన ఈ క్షేత్రం ఈ రోజుకీ తన విశిష్టతను చాటుకుంటూనే విలసిల్లుతోంది.


More Bhakti News