అడగకుండానే వరాలనిచ్చే బాబా
శిరిడీ పరిసరాలలో గల ఓ గ్రామంలో కుంటితనంతో బాధపడుతోన్న ఒక వ్యక్తి ఉంటూ ఉండేవాడు. అతను చిరువ్యాపారి కావడం వలన అవసరమైన సరుకుల కోసం ఎక్కువగా తిరగవలసివస్తూ వుండేది. అయితే కుంటితనం కారణంగా అతను తిరగలేకపోతూ వుండటం వలన, వ్యాపారంలో ఆశించిన అభివృద్ధి కనిపించే కాదు.
అలాంటి పరిస్థితిల్లోనే సాయిబాబా గురించిన విషయాలు ఆయన చెవిన పడతాయి. బాబా దర్శనం చేసుకుని తన పరిస్థితిని గురించి చెప్పాలని నిర్ణయించుకుంటాడు. అక్కడికి శిరిడీ కాస్త దూరమే అయినా, కాలి నడకన తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. అతి కష్టం మీద శిరిడీలోని మశీదుకి చేరుకుంటాడు. తనలా కష్టాలు చెప్పుకునే భక్తులు ఆయన దగ్గర ఎక్కువమంది వుండటం చూస్తాడు.
తన కుంటితనం పోవాలని బాబాను అడిగితే .. చుట్టూ వున్న వాళ్లు వింటారు. తనది అత్యాశ అని నవ్వుకుంటారేమోనని భావిస్తాడు. చాలాసేపు ఈ విషయాన్ని గురించే ఆలోచిస్తూ తర్జనభర్జన పడతాడు. ఇక్కడ అడుగుపెట్టిన మరుక్షణమే తాను ఎందుకు వచ్చింది బాబాకి తెలిసిపోయి వుంటుంది. తన కోరిక ధర్మ బద్ధమైనదే అయితే ఆయన తప్పక తీరుస్తాడని భావించి .. బాబా దర్శనం చేసుకుని వెనుదిరుగుతాడు.
అలా కొంతదూరం నడచిన అతను ... సత్తువలేని తన కాలు జలదరిస్తూ ఉన్నట్టుగా అనిపించడంతో ఒకచోట ఆగుతాడు. ఎలాంటి స్పర్శ లేకుండా వుండే ఆ కాలుకి స్పర్శ తెలుస్తూ వుండటం అతనికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆ కాలుని కూడా నేలపై మోపి నడవడానికి ప్రయత్నిస్తాడతను. కొంతసేపు కాస్త ఇబ్బందిగా అనిపించినా, ఆ తరువాత మంచిగా నడవడం మొదలుపెడతాడు.
బాబా దయతో తన కుంటితనం పోయినందుకు అతను సంతోషంతో పొంగిపోతాడు. అక్కడి నుంచి వెనుదిరిగి మళ్లీ కాలినడకనే శిరిడీ చేరుకొని బాబా దర్శనం చేసుకుంటాడు. ఇంకా చేతిలో ఆ కర్ర ఎందుకూ ? అని బాబా అడగడంతో ... అలవాటు ప్రకారం తాను పట్టుకున్న కర్రను పక్కన పెట్టేస్తాడు. బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి ... కృతజ్ఞతలు తెలుపుకుంటాడు.