స్వామి అనుగ్రహం వుంటే చాలు
రాఘవేంద్రస్వామి బృందావన ప్రవేశం గురించి చుట్టుపక్కల గ్రామాలవారికి తెలుస్తుంది. చివరిగా ఆయన దర్శనాన్ని ప్రత్యక్షంగా చేసుకోవడం కోసం పెద్దసంఖ్యలో మంచాల గ్రామానికి తరలి వస్తూ వుంటారు. రాఘవేంద్రస్వామిని గురించి విని ఆయనని మనసులోనే తలచుకుంటూ వుండే ఒక వ్యక్తికి మాత్రం ఆ గ్రామానికి ఎలా చేరుకోవాలో తెలియలేదు. ఎందుకంటే .. అతనికి చూపులేదు.
తనకి కూడా మంచాలకి రావాలని ఉందనీ ... తనని కూడా అక్కడికి తీసుకువెళ్లమని ఇరుగు పొరుగువారిని ఎంతగానో బతిమాలాడు. సమయం ఎక్కువగా లేకపోవడం వలన తామే ఎంతో వేగంగా వెళ్లవలసి ఉందనీ, ఆలస్యమైతే తమకే ఆయన దర్శనం లభించకపోవచ్చని ఎవరికి వాళ్లు వెళ్లిపోతుంటారు.
చూపులేని ఆ వ్యక్తి క్షణం కూడా ఆలోచించలేదు. భగవంతుడే దారి చూపిస్తాడు అని విశ్వసించి అక్కడి నుంచి బయలుదేరతాడు. స్వామి పాదాలను ఒక్కసారి తాకాలనేదే అతని ఆశ. అక్కడక్కడా కొంతమంది సాయం చేస్తూ ఉండటంతో ఆ వ్యక్తి మంచాలకి చేరుకుంటాడు. పడుతూ .. లేస్తూ రావడం వలన ఆయన రూపురేఖలు మరింత మారిపోయాయి.
అతను జనాన్ని తోసుకుంటూ తన వైపు వస్తుండటాన్ని గమనించిన స్వామి ఒక్క క్షణం ఆగుతాడు. స్వామికి సమీపంగా రాగానే అతణ్ణి కొంతమంది అడ్డుకుంటారు. తనని రాఘవేంద్రస్వామి పాదాలపై పడవేయమనీ, ఒక్కసారి ఆయనని చూడాలని వుందని అంటాడు. ఆయన ఎదురుగానే స్వామి ఉన్నాడని చెప్పగానే సంతోషంతో పొంగిపోతూ పాదాలపై పడతాడు. తనకి చూపును ప్రసాదిస్తే ఆయనని చూస్తాననీ, ఆ తరువాత చూపులేకపోయినా ఆయన రూపాన్ని గుండెల్లో దాచుకుని జీవిస్తానని అంటాడు.
రాఘవేంద్రస్వామి ఆ వ్యక్తిని ఆప్యాయంగా పైకి లేవనెత్తి తన చేతులతో ఆ వ్యక్తి కన్నులను స్పర్శిస్తాడు ... అంతే ... ఆ వ్యక్తికి చూపు వస్తుంది. తన ఎదురుగా వున్న స్వామివారిని కనుల నిండుగా ... కనుల పండుగగా చూసుకుని ఆ వ్యక్తి ఆనందంతో పొంగిపోతూ మరోమారు ఆయన పాదాలకు సాష్టాంగ నమస్కారం చేస్తాడు.