వ్రతాల వేదికగా భాద్రపద మాసం
భాద్రపదమాసం అనేక వ్రతాలకు ... అవతారమూర్తుల ఆవిర్భవానికి వేదికగా కనిపిస్తూ వుంటుంది. గజగౌరీ వ్రతం .. సువర్ణగౌరీ వ్రతం .. రుషిపంచమీ వ్రతం .. దూర్వాష్టమీ వ్రతం .. గజలక్ష్మీ వ్రతం .. దశావతార వ్రతం .. అనంతపద్మనాభ వ్రతం .. ఉమామహేశ్వర వ్రతం మొదలైన వ్రతాలతో ఈ మాసం అంతా కూడా సందడిగా కనిపిస్తూ వుంటుంది. ఈ వ్రతాలలో దేనికి ఉండవలసిన ప్రాముఖ్యత దానికి ఉండనే వుంది.
అయితే 'అనంతపద్మనాభ వ్రతం' మరింత విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది. భాద్రపద శుద్ధ చతుర్దశి రోజున ఈ వ్రతాన్ని ఆచరిస్తూ వుంటారు. ఈ రోజున తోరమును ధరించి అనంతుడిని ఆరాధించడం వలన సమస్త సంపదలు కలుగుతాయని చెప్పబడుతోంది. ఇక శ్రీమహావిష్ణువు లోక కల్యాణం కోసం పలు అవతారాలను ధరించాడు. ఆ అవతారాలలో ఒకటైన బలరామ జయంతి ... వరాహ జయంతి ... వామన జయంతి ఈ మాసంలో జరుగుతాయి. ఒక రకంగా ఇది ఈ మాసానికి గల ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.
భాద్రపద మాసంలో పెద్ద పండుగగా 'వినాయక చవితి' కనిపిస్తుంది. ఈ మాసంలో ఇది ఎక్కువ రోజుల పాటు సందడి చేస్తుంది. భాద్రపద శుద్ధ చవితి రోజున వినాయకుడిని పూజిస్తూ వుంటారు. ధర్మ బద్ధంగా ఎవరు ఎలాంటి కార్యక్రమాన్ని ఆరంభించినా ... శుభకార్యాలకు శ్రీకారం చుట్టినా వాటికి ఆటంకం కలగకుండా చూడమని వినాయకుడిని పూజిస్తుంటారు. ఆయన ఆశీస్సులతోనే వాటిని ప్రారంభిస్తూ వుంటారు.
భాద్రపద శుద్ధ చవితి ... వినాయకుడి జన్మతిథిగా చెప్పబడుతోంది. అందువలన ఈ రోజున ఆయన అనుగ్రహాన్ని కోరుతూ ఆయనకి ఇష్టమైన ఇరవై ఒక్క రకాల పత్రులతో పూజిస్తూ వుంటారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ ఇష్టంగా ఈ పూజలో పాల్గొనడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఇలా భాద్రపదమాసం కూడా తన స్థాయిలో సందడి చేస్తూ ముందుకు సాగుతుంది.