శని ప్రభావం ఇలా కూడా తగ్గుతుందట !

సాధారణంగా కొండ ప్రదేశాల్లో గల ఆలయాలకి వెళ్లినప్పుడు అక్కడ కోతుల గుంపులు కనిపిస్తుంటాయి. కొండపై ఆలయం అనగానే సహజంగానే అక్కడ చెట్లు ... తాగడానికి నీళ్లు వుంటాయి. ఈ కారణంగానే భక్తులు దైవదర్శనం చేసుకుని, గుళ్లో పెట్టిన ప్రసాదమో ... తాము ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న పదార్థాలో అక్కడ తినేసి వెళుతూ వుంటారు.

తాగడానికి నీళ్లు ... నీడనిచ్చే చెట్లతో పాటు, భక్తుల దగ్గర గల కొబ్బరి చిప్పలు ... అరటిపండ్లు ... వాళ్లు తెచ్చుకునే తినుబండారాలు దొరుకుతూనే వుంటాయి కనుక, కోతులు ఈ ప్రదేశాలను తమ నివాసాలుగా మార్చుకుంటూ వుంటాయి. ఇవి భక్తుల సందడికి అలవాటు పడిపోతాయి కనుక, ఎలాంటి బెదురూ లేకుండా వచ్చి చేతిలోని కొబ్బరి చిప్పలు ... అరటిపండ్లు లాక్కుని మరీ పోతుంటాయి.

అయ్యో కోతి పట్టుకుపోయిందేనని కొంతమంది భక్తులు బాధపడితే, మరికొందరు హనుమంతుడేగా పట్టుకెళ్లింది అని అనుకుంటారు. నిజానికి ఈ విధంగా అనుకోవడం చాలామంచిది. ఈ విశ్వాసంతో కోతులకు ఆహారాన్ని అందించడం వలన మంచి ఫలితాలను పొందవచ్చు. కోతులను హనుమంతుడి రూపాలుగా భావిస్తూ వుండటం వల్లనే ఎవరూ కూడా వాటిని గాయపరచడానికి ప్రయత్నం చేయరు.

శని దోషం కలిగిన వాళ్లు హనుమంతుడిని పూజిస్తే ఆ దోషం తగ్గుముఖం పడుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. అలాగే కోతులకు అరటిపండ్లను అందించడం వలన కూడా శని దోష ప్రభావం తగ్గుతుందని అంటున్నాయి. చాలా తేలికగా తిన గలిగే అరటిపండ్లను కోతులు ఎంతగానో ఇష్టపడతాయి. అందువలన శని దోషంతో బాధలు పడుతోన్నవాళ్లు ఆలయాలకి వెళ్లినప్పుడు అక్కడి కోతులకు అరటిపండ్లను అందించడం వలన, శని దోష ప్రభావం నుంచి ఉపశమనం లభిస్తుంది.


More Bhakti News