అలా భగవంతుడు కళ్లు తెరిపించాడు
కబీరుదాసు అతిథులను సేవించనిదే భోజనం చేసేవాడు కాదు. పేదరికం కారణంగా ఆయన తీరు భార్య 'లోయీ'కి చాలా ఇబ్బందిని కలిగిస్తూ వుండేది. మొదట్లో ఆమె అసహనానికి లోనైనా, ఆ తరువాత ఆయన గొప్ప మనసును అర్థం చేసుకుని సర్దుకుపోతుంటుంది. ఎప్పటిలానే ఒక రోజున ఆయన కొందరు అతిథులను తన ఇంటికి ఆహ్వానిస్తాడు.
ఇంట్లో సరుకులు లేకపోవడంతో అరువు కోసం లోయీ ఒక వర్తకుడి దగ్గరికి వెళుతుంది. ఆమె పై మనసు పారేసుకున్న ఆ వర్తకుడు, తన కోరిక తీరుస్తే కావలసిన సరుకులు ఇచ్చి పంపిస్తానని అంటాడు. అతిథుల ఆకలి తీర్చడం ... వాళ్లకి భర్త ఇచ్చిన మాటను నిలబెట్టడమే ముఖ్యమని ఆమె భావిస్తుంది. అతిథులకు వడ్డించి వాళ్లను పంపించి వస్తానని ఆ వర్తకుడికి మాట ఇస్తుంది.
అక్కడి నుంచి అవసరమైన సరుకులు ఇంటికి తీసుకువచ్చి వంటచేసి వచ్చినవారికి వడ్డిస్తుంది. అతిథులు సంతృప్తికరంగా భోజనం చేసి కబీరు దంపతులను ఆశీర్వదించి వెళ్లిపోతారు. అప్పుడు లోయీ తనకీ .. వర్తకుడికి జరిగిన సంభాషణ గురించి భర్తతో చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆ వర్తకుడు అతిథుల ఆకలిని తీర్చే భాగ్యాన్ని కలిగించినందువలన ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకోవలసిందేనని అంటాడు కబీరు.
బాధపడవద్దని చెప్పి వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా ఆ రాత్రి ఆమెని వెంటబెట్టుకుని వర్తకుడి ఇంటికి తీసుకువెళతాడు. చెప్పిన సమయానికి తన ఇంట్లోకి అడుగుపెట్టిన లోయీని చూసి ఆ వర్తకుడు ఆశ్చర్యపోతాడు. అంత రాత్రివేళ ... పైగా హోరున వర్షం కురుస్తుండగా ఆమె ఒంటరిగా వస్తుందని తాను అనుకోలేదని అంటాడు. తాను ఒంటరిగా రాలేదనీ ... తన భర్త తోడుగా వచ్చాడని లోయీ చెప్పడంతో ఆయన ఒక్కసారిగా ఉలిక్కిపడతాడు.
కబీరు ఎక్కడ ఉన్నాడని ఆ వర్తకుడు కంగారుగా అడుగుతాడు. బయటే ఉన్నాడని ఆమె చెప్పడంతో బిత్తరపోతాడు. ఆమె చెబుతున్నది నిజమో కాదో తెలుసుకోవడం కోసం బయటికివెళ్లి చూస్తాడు. అక్కడ కబీరు స్థానంలో ఆ వర్తకుడికి సాక్షాత్తు శ్రీరాముడు కనిపిస్తాడు. అంతే తాను ఎంతటి పాపానికి ఒడిగట్టినది ఆయనకి అర్థమవుతుంది. తనని మన్నించమంటూ వచ్చి కబీరు పాదాలపై పడతాడు.
పరస్త్రీల పట్ల వ్యామోహం నరకానికి చేరుస్తుందనీ, భగవంతుడి పట్ల ప్రేమ స్వర్గానికి దారి చూపిస్తుందని చెబుతాడు కబీరు. పశ్చాత్తాపమే పాపఫలితాన్ని తగ్గిస్తుందని చెప్పి ... భార్యను వెంటబెట్టుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు.