గంగాదేవి ఇక్కడ శిలగా మారిందట !
సాధారణంగా పరమశివుడు పార్వతీదేవి సమేతంగాను ... కొన్ని క్షేత్రాల్లో గంగాదేవి సమేతంగాను దర్శనమిస్తూ వుంటాడు. మరికొన్ని క్షేత్రాల్లో గంగా పార్వతీ సమేతంగా కూడా పూజలు అందుకుంటూ వుంటాడు. అలా ఆదిదేవుడుతో పాటు గంగాదేవి వెలసిన పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రంగా 'సోమవరం' అలరారుతోంది.
నల్గొండ జిల్లా నేరేడుచర్ల మండలం పరిధిలో మూసీనది ఒడ్డున ఈ క్షేత్రం దర్శనమిస్తుంది. భ్రుగుమహర్షిచేత ప్రతిష్ఠించబడిన కారణంగా ఇక్కడి స్వామి భ్రుగుమాలికా సోమేశ్వరస్వామిగా పూజాభిషేకాలు అందుకుంటూ వుంటాడు. మిగతా ఆలయాల్లో మాదిరిగా ఇక్కడ గంగాదేవి విగ్రహ రూపంలో కనిపించదు. ఒక శిలా రూపంగా ఆమె ఇక్కడ దర్శనమిస్తూ వుంటుంది.
అందుకు కారణంగా ఇక్కడ ఒక ఆసక్తికరమైన కథ వినిపిస్తూ వుంటుంది. ఒకానొక విషయంలో గంగాదేవి .. పరమశివుడిపై అలిగిందట. అలక కారణంగా అక్కడి నుంచి వెళ్లాలో ... ఉండాలో తేల్చుకోలేక ఆమె సతమతమైపోయిందట. చివరికి అక్కడి నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకుని కొంతదూరం నడిచింది. కానీ స్వామికి దూరంగా ఉండటం సాధ్యంకాదని భావించి అక్కడే శిలగా మారిపోయిందట.
శిలా రూపంలో వున్న ఈ గంగమ్మకు భక్తులు పూజాభిషేకాలు నిర్వహిస్తూ వుంటారు. గంగమ్మని మహిమగల తల్లిగా చెప్పుకుంటూ వుంటారు. ఎందుకంటే సమీపంలో గల మూసీనది ఎంత ఉధృతంగా ప్రవహించినప్పటికీ, శిలారూపంలో గల గంగను దాటి ఇంతవరకూ ముందుకురాలేదు. ఒక్కోసారి మూసీనది ఉగ్రరూపం చూసి భయపడిన ప్రజలు వెంటనే అమ్మవారినే ఆశ్రయిస్తారు. ఆ తల్లికి పూజాభిషేకాలు నిర్వహించి, ఆమెకి ఇష్టమైన నైవేద్యాలతో పాటు చీరసారెలు సమర్పిస్తారు.
వాళ్లు అలా చేయగానే మూసీనది తన ఉగ్రరూపాన్ని తగ్గించుకుని ప్రవహిస్తుందట. అందువలన అటు ఆదిదేవుడి ఆలయాన్నీ ... ఇటు ఊరుని కూడా గంగమ్మ తల్లి కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటుందని భక్తులు ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు. ఏడాదికి ఒకసారి ఆ తల్లికి జాతరను నిర్వహించి .. పెద్ద సంఖ్యలో ఆ ఉత్సవంలో పాల్గొని ఆ తల్లికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వుంటారు.