రక్షించే రామలింగేశ్వరుడు
ఏదైనా ఆపదలో చిక్కుకున్నప్పుడు ఎవరైనా సరే ఆ భగవంతుడినే తలచుకుంటారు. ఈశ్వరా ఏ పాపం చేశానో తెలియదు కానీ ... ప్రస్తుతం ఈ ఆపదలో చిక్కుకున్నాను, ఈ గండం నుంచి నువ్వే గట్టెక్కించాలని ఆ దైవాన్ని ప్రార్ధిస్తుంటారు.
ధర్మబద్ధమైన జీవితాన్ని కొనసాగిస్తూ ... ఇతరులకు సహాయ సహకారాలను అందిస్తూ .. ఈశ్వరుడి పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండాలేగానీ రక్షకుడిగా నిలవడానికి ఆయన క్షణం కూడా ఆలస్యం చేయడు. అలా భక్తులను ఆదుకుంటూ ఆపద్బాంధవుడుగా పిలిపించుకుంటోన్న సదాశివుడు ... రామలింగేశ్వరుడుగా అనేక ప్రాంతాల్లో ఆవిర్భవించాడు.
అలాంటి విశిష్టమైన రామలింగేశ్వర క్షేత్రాల్లో ఒకటిగా 'తిరువూరు' దర్శనమిస్తుంది. కృష్ణా జిల్లా తిరువూరు - రాజుపేటలో ఈ ఆలయం అలరారుతోంది. ప్రాచీనకాలంనాటి ఈ శివాలయం క్రమంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఇక్కడి శివలింగం పరిమాణం రీత్యా చిన్నదే అయినా, మంచి మహిమగలిగినదని చెబుతుంటారు.
ఇక్కడి రామలింగేశ్వరుడు పిలిస్తే పలుకుతాడనీ, ఆపదలో వున్నప్పుడు తలచుకుంటేచాలు ఏదో ఒక రూపంలో వచ్చి రక్షిస్తాడని భక్తులు విశ్వసిస్తూ వుంటారు. ఆపదల నుంచి గట్టెక్కినవారు ఆ స్వామికి కృతజ్ఞతలు తెలుపుకుని కానుకలు సమర్పిస్తుంటారు. ప్రతి సోమవారంతో పాటు పర్వదినాల్లోను .. కార్తీక మాసంలోను ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా వుంటుంది. స్వామిని దర్శించుకోవడం ... ఆయన సేవలో పాలుపంచుకోవడం ఇక్కడి భక్తులు అదృష్టంగా భావిస్తుంటారు.