నల్లరాతి గణపతిని పూజిస్తే కలిగే ఫలితం
ఒక్కో విధమైన శివలింగాన్ని రూపొందించుకుని అర్చించడం వలన ఒక్కో విశేష ఫలితం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అలాగే వివిధ గణపతి మూర్తులలో ఒక్కొక్క మూర్తిని పూజించడం వలన ఒక్కో ఉత్తమమైన ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి.
సాధారణంగా గణపతిని పూజిస్తే ఆటంకాలు తొలగిపోయి కార్యసిద్ధి కలుగుతుంది. చిక్కుముడులన్నీ కూడా తేలికగా విడిపోయి ... సంతోషకరమైన జీవితం లభిస్తుంది. ఇక విశేషమైనవిగా చెప్పబడుతోన్న కొన్ని గణపతిమూర్తులు గ్రహ సంబంధమైన దోషాలను కూడా నివారిస్తూ ఉంటాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.
నవగ్రహాలలో ప్రతి గ్రహం తనదైన రీతిలో జీవితాలను ప్రభావితం చేస్తుంటుంది. వాటిలో శనిగ్రహం చూపించే ప్రభావానికి ఎక్కువగా భయపడుతూ వుంటారు. శని గ్రహ సంబంధమైన దోషాల కారణంగా అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంటుంది. ఆర్ధికపరమైన సమస్యలు ... అనారోగ్య సమస్యలు ... అనుకున్న పనులు ఆగిపోవడం ... అపజయాలు చవిచూడటం ... వ్యసనాలకు బానిసలు కావడం జరుగుతూ వుంటుంది.
ఈ విధమైన పరిస్థితుల్లో శనిదేవుడి అనుగ్రహం కోసం ఆయన క్షేత్రాలను దర్శించడం ... శాంతులు చేయించడం చేస్తుంటారు. ఒక్కో గ్రహ సంబంధమైన దోషం ... ఒక్కో గణపతి మూర్తిని పూజించడం వలన తొలగిపోతుందని చెప్పబడుతోన్న నేపథ్యంలో, ఏ గణపతి మూర్తిని పూజించడం వలన శని సంబంధమైన దోషాలు తొలగిపోతాయనే సందేహం కొంతమందికి కలుగుతుంటుంది.
శని దోషం కారణంగా నానాఅవస్థలు పడుతోన్నవాళ్లు నల్లరాతితో చేయబడిన గణపతిని పూజించాలి. నల్లరాతితో మలచబడిన వినాయకుడిని పూజించడం వలన శని దోష ప్రభావం తగ్గుముఖం పడుతుందనీ ... అనతి కాలంలోనే ఆశించిన ఫలితం కనిపిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.