పోలాల అమావాస్య విశిష్టత !

శ్రావణ బహుళ అమావాస్యను 'పోలాల అమావాస్య' గా పిలుచుకుంటూ వుంటారు. పోలాల అమావాస్యకు ఎంతో విశిష్టత వుంది. పితృదేవతలను పూజించడం ... ఆవులను ఎద్దులను పూజించడం ... పోలేరమ్మను ఆరాధించడం వంటివి ఈ రోజున ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తూ వుంటాయి. పితృదేవతలకు ప్రీతికరమైనదిగా చెప్పబడుతోన్న ఈ రోజున వాళ్లకి తర్పణాలు వదలడం ... పిండ ప్రదానాలు చేయడం జరుగుతూ వుంటుంది.

ఇక ఒకానొకప్పుడు నందీశ్వరుడి సేవకు మెచ్చిన పరమశివుడు, ఆవులను ... ఎద్దులను శ్రావణ బహుళ అమావాస్య రోజున పూజించినవారికి సకల శుభాలు కలుగుతాయని వరాన్ని ఇవ్వడం జరిగింది. ఈ కారణంగా గ్రామీణ ప్రాంతాలలో ఆవులను ... ఎద్దులను పూజిస్తూ వుంటారు. ఎప్పుడూ ఎంతో కష్టం చేసే ఎద్దులకు ఈ రోజున పూర్తి విశ్రాంతిని కల్పిస్తారు.

ఇక ఇదే రోజున పోలేరమ్మను ఆరాధించే ఆచారం కూడా చాలా ప్రాంతాలలో కనిపిస్తూ వుంటుంది. గ్రామీణ ప్రాంతాలకి చెందిన ప్రజలు 'పోలాంబ' పేరుతో అమ్మవారిని పూజిస్తారు. ఆమెకి ఇష్టమైన నైవేద్యాలతో పాటు చీరసారెలు సమర్పిస్తారు. ఈ విధంగా చేయడం వలన ఆ తల్లి అనుగ్రహం లభిస్తుందనీ ... ఫలితంగా వర్షాలు పంటలకి అనుకూలంగా కురుస్తాయని విశ్వసిస్తుంటారు.

జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సుఖశాంతులతో కొనసాగాలంటే పితృదేవతల ఆశీస్సులు కావాలి. అలాగే వర్షాలు బాగా కురవాలంటే గ్రామదేవత అయిన పోలేరమ్మ అనుగ్రహం వుండాలి. వర్షాలుపడితే వ్యవసాయ పనులు చేయడానికి అనుకూలంగా ఎద్దులు ఆరోగ్యంగా వుండాలి. పంటలు బాగా పండినప్పుడే ఆవులకు మేత దొరుకుతుంది. ఫలితంగా లభించే పాలు ఆ కుటుంబ సభ్యులను ఆరోగ్యపరంగాను ... ఆర్ధికంగాను ఆదుకుంటాయి.

తమ జీవనాధారానికి తోడ్పాటుని అందించే దేవతను ... పెద్దలను ... పశువులను పూజించే పర్వదినంగా పోలాల అమావాస్య కనిపిస్తుంది. గ్రామదేవతను ఆరాధిస్తూ ... వ్యవసాయానికి సహకరించే పశువులను పూజించే పర్వదినం కనుక ఇది ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తుంది. ప్రత్యేకతను సంతరించుకుని తన విశిష్టతను చాటుకుంటూ వుంటుంది.


More Bhakti News