ఇక్కడి స్వామి ప్రత్యేకత ఇదే !

ఒకసారి ఒక ముఖ్యమైన కార్యంపై సత్యలోకానికి వెళ్లిన భ్రుగు మహర్షి, తనకి తగిన రీతిలో స్వాగతం లభించలేదనే కోపంతో భూలోకంలో బ్రహ్మకు పూజలు జరగకుండా శపిస్తాడు. కైలాసంలో కూడా అదే పరిస్థితి ఎదురుకావడంతో లింగరూపంలో మాత్రమే శివుడు పూజించబడతాడని శపిస్తాడు. అలాగే వైకుంఠంలో శ్రీమహావిష్ణువు కూడా పట్టించుకోని కారణంగా అహంకారంతో ఆయన వక్షస్థలాన్ని కాలుతో తాకుతాడు.

ఫలితంగా అహంకారంతో పాటు తపోశక్తిని కూడా కోల్పోతాడు. శ్రీమహావిష్ణువును శరణు కోరితే ... భూలోకంలో జపమాలతో సంచరించమనీ, ఆ జపమాల కిందపడిన చోటున శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించమనీ ... అప్పుడు ఆయన కోల్పోయిన తపోశక్తిని తిరిగి పొందడం జరుగుతుందని చెబుతాడు.

అలా భూలోకానికి వచ్చిన భ్రుగు మహర్షి ... ఒక ప్రదేశానికి రాగానే ఆయన జపమాల జారి కిందపడిపోయింది. దాంతో ఆయన అక్కడే శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడు. తాను కోల్పోయిన శక్తులను తిరిగి పొందాడు. ఈ సంఘటనకు వేదికగా నిలిచిన ఆ ప్రదేశమే 'సోమవరం' ... ఇది నల్గొండ జిల్లా నేరేడుచర్ల మండలంలో అలరారుతోంది. భ్రుగు మహర్షి జపమాలతో ముడిపడిన క్షేత్రం కావడం వలన ఇక్కడి స్వామిని భ్రుగుమాలికా సోమేశ్వరస్వామి అని పిలుస్తూ వుంటారు.

భ్రుగు మహర్షి పోగొట్టుకున్నవి ఇక్కడ తిరిగి పొందడం వలన, ఇది మహిమాన్వితమైన ప్రదేశంగా భావిస్తూ వుంటారు. అందువలన తమకి సంబంధించిన ఖరీదైన వస్తువులు గానీ ... ముఖ్యమైన పత్రాలను గానీ .. అన్యాయంగా చేజారిపోయిన ఆస్తిపాస్తులను గాని తిరిగి పొందాలనుకునే వాళ్లు ఇక్కడి స్వామిని ఎక్కువగా దర్శిస్తూ వుంటారు. తమ మనసులోని మాటను చెప్పుకుని ముడుపులు కడుతుంటారు. వాళ్ల కోరిక ధర్మబద్ధమైనదే అయితే అది తప్పక నెరవేరుతుందని స్థానికులు చెబుతుంటారు.

కాలక్రమంలో ఆలయం లేకుండా వున్న ఇక్కడి శివుడిని 'వేమారెడ్డి' అనే రాజు దర్శించుకున్నాడట. తన తమ్ముడి కుష్ఠు వ్యాధి తగ్గిపోతే స్వామికి ఆలయాన్ని నిర్మిస్తానని మొక్కుకున్నాడు. ఆ రాజు తన ఇంటికి చేరుకునేలోగా ఆయన తమ్ముడి వ్యాధి నివారించబడిందట. దాంతో ఆ రాజు తమ్ముడిని వెంటబెట్టుకు వచ్చి స్వామివారికి ఆలయాన్ని నిర్మించినట్టు ఇక్కడి శాసనాలు చెబుతున్నాయి. ఇలా కోల్పోయినవి తిరిగి లభింపజేసే స్వామిగా ... వ్యాధులను వివారించే స్వామిగా ఇక్కడి భ్రుగు మాలికా సోమేశ్వరుడికి మంచి పేరుంది.


More Bhakti News