అనంతమైన ఫలితాలనిచ్చే తులసీదళం

ఎక్కడెక్కడో తిరిగి వివిధ రకాల పుష్పాలను సేకరించి పూజ ద్వారా భగవంతుడికి సమర్పించడం జరుగుతుంది. ఒకవేళ పువ్వులు లభించకపోయినా చింతించవలసిన పనిలేదు. ఒక్క తులసి దళం తీసుకువచ్చి తన పాదాల చెంత సమర్పిస్తేచాలు సమస్త దోషాలు నశింపజేసి విశేష పుణ్యఫలాలను ప్రసాదిస్తానని తన భక్తులతో శ్రీమన్నారాయణుడు చెప్పాడట.

భగవంతుడు చెప్పినట్టుగా తులసీ దళాన్ని 'కామిక ఏకాదశి' రోజున సమర్పించడం వలన మరింత విశేషమైన ఫలితాలు కలుగుతాయని చెప్పబడుతోంది. 'శ్రావణ బహుళ ఏకాదశి'ని ... కామిక ఏకాదశి అని అంటారు. ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన పుణ్యరాశి పెరుగుతుంది. ఫలితంగా ధర్మబద్ధమైన కోరికలు నెరవేరతాయని చెప్పబడుతోంది.

ఈ రోజున ఉదయాన్నే స్నానం చేసి ... పూజా మందిరాన్ని వివిధ రకాల పూల మాలికలతో అలంకరించుకోవాలి. ఉపవాస దీక్షను చేపట్టి ... రాత్రి జాగరణకి సిద్ధపడి శ్రీమహావిష్ణువును షోడశ ఉపచారాలతో పూజించాలి. పూజలో శ్రీమహావిష్ణువుకి ప్రీతికరమైన తులసిని తప్పక ఉపయోగించాలి. తులసీదళంతో స్వామివారిని అర్చించడం వలన అనంతమైన పుణ్యఫలాలు కలుగుతాయి. ఈ రోజున స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలను ప్రేమానురాగాలతో సమర్పించాలి. పూజ అనంతరం దగ్గరలోని వైష్ణవ క్షేత్రాన్ని దర్శించుకోవాలి.

ఈ రోజంతా కూడా జపం ... భజన ... పారాయణం .. ఇలా ఏదో ఒక రూపంలో భగవంతుడి నామాన్ని స్మరిస్తూ వుండాలి. ఏది చేసినా భగవంతుడి పట్ల అసమానమైన భక్తి శ్రద్ధలను ... ఆప్యాయతను కలిగివుండి, అపారమైన విశ్వాసాన్ని ప్రకటిస్తూ వుండాలి. శ్రీమన్నారాయణుడికి ప్రీతికరమైన ఈ రోజున 'నవనీతం' దానం చేయాలి ... అలాగే 'దీపదానం' చేయాలి. ఈ విధంగా చేయడం వలన విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.


More Bhakti News