కుజుడుని ఇలా శాంతింపజేయవచ్చట !
నవగ్రహాలలో కుజుడుకి ఒక ప్రత్యేకమైన స్థానం వుంది. కొన్ని ఆధ్యాత్మిక గ్రంధాలను అనుసరించి, ఆయన శ్రీమన్నారాయణుడికీ ... భూమాతకు జన్మించినవాడిగా చెప్పబడుతున్నాడు. త్రిశూలం ... గద అనే ఆయుధాలను ధరించి, అభయ - వరద హస్తాలతో దర్శనమిస్తూ వుంటాడు. మేషము ... వృచ్చిక రాశులకు అధిపతి అయిన ఈయన పొట్టేలును వాహనంగా చేసుకుని సంచరిస్తూ వుంటాడు.
కుజుడికి సంబంధించిన దోషాల కారణంగా వివిధ రకాల సమస్యలను ఎదుర్కోవలసి వుంటుంది. కుజ సంబంధిత దోషం కలిగిన వాళ్లకి సమాజంలో తన అనుకునే వాళ్లంతా దూరమయ్యేలా చేస్తుంటాడు. మనస్పర్థలు సృష్టించి మానసికంగా ఆందోళనకి గురిచేస్తాడు. వివాహం విషయంలో అనేక అవాంతరాలను సృష్టిస్తూ, నిరాశా నిస్పృహలకి గురిచేస్తుంటాడు. వివిధ రకాల వ్యాధులకు గురిచేసి మానసికంగా దెబ్బతీస్తాడు. అందువలన కుజ దోషం అనగానే చాలామంది కూడా భయాందోళనలకు లోనవుతుంటారు. సాధ్యమైనంత త్వరగా ఆయనని శాంతింపజేసి అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నిస్తుంటారు.
కుజుడిని శాంతింప జేయాలనుకునేవారు 'పగడం' ధరించి మంగళవారం రోజున ఆయనని ఆరాధించవలసి వుంటుంది. భూమి ... బంగారం ... ఎరుపురంగు వస్త్రం ... కందిపప్పును బ్రాహ్మణులకు దానంగా ఇవ్వవలసి వుంటుంది. అంతే కాకుండా సదాశివుడిని పూజిస్తూ వున్నా ... హనుమంతుడిని ఆరాధిస్తూ వున్నా కుజుడు శాంతించి అనుగ్రహిస్తాడని చెప్పబడుతోంది.